అంచెలంచెలుగా ఎదుగుతూ, స్వయంకృషితో పైకొచ్చిన వ్యక్తి చిరంజీవి. గాడ్ ఫాదర్లు లేకుండా.. చిత్రసీమలో నెంబర్ వన్ స్థానాన్ని అధిరోహించడం అంత తేలికైన విషయం కాదు. దాదాపు అసాధ్యమే. దాన్ని చిరు సుసాధ్యం చేశాడు. అయితే.. ఈ ప్రయాణంలో ఎన్నో ఆటు పోట్లు ఎదురయ్యాయి. ఎన్నోసార్లు అవమానానికి గురయ్యాడు కూడా. అయితే చిరు కృంగిపోలేదు. వాటిని ధీటుగా ఎదుర్కొన్నాడు. ఎదురు దెబ్బలనే మెట్లుగా చేసుకుని.. ఎదిగాడు.
చిరు కథానాయకుడిగా అడుగుపెడుతున్న తొలి రోజుల్లో ఓ ఘోరమైన అవవామనం ఎదురైందట. స్నేహితుడు ఇచ్చిన పాస్ ద్వారా.. ఓ హీరో సినిమా ప్రీమియర్ షోకి హాజరయ్యాడట చిరు. తొలి వరుసలో కూర్చున్న చిరంజీవిని `ఇక్కడ కూర్చోవడానికి వీల్లేదు.. వెనక్కి వెళ్లి కూర్చో` అంటూ సదరు హీరో.. బలవంతంగా వెనక్కి పంపేశాడట. ఆ వెనుక కూర్చున్నా.. మరెవరో వచ్చి.. కూర్చున్న చోటు నుంచి లేపేశార్ట. దాంతో చిరు చాలా అవమానంగా ఫీలయ్యాడట. `ఏదో ఓ రోజు.. తప్పకుండా పెద్ద స్థాయికి వెళ్తాను. ఈ హీరో కంటే పెద్ద హీరోని అవుతాను` అని చిరు అప్పుడే ఫిక్సయ్యాడట. ఈ విషయాన్ని నాగబాబునే ఓ వీడియోలో చెప్పుకొచ్చారు. ఈ సంఘటన చిరంజీవిని మార్చేసిందని, కాకపోతే.. ఆ విషయాన్ని చిరు మర్చిపోయి ఉండొచ్చని, కానీ ఆ రోజు అన్నయ్యలో చూసిన ఆవేశాన్ని ఎవరూ మర్చిపోలేదని, ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లాడు నాగబాబు. కాకపోతే ఆ హీరో ఎవరో మాత్రం చెప్పలేదు. చిరుని అంతగా అవమానించిన ఆ హీరో ఎవరో మరి.