నాగార్జున కెరీర్లోనే సూపర్ హిట్ గా నిలిచిన సినిమా... `సోగ్గాడే చిన్ని నాయిన`. దీనికి సీక్వెల్ చేయాలని.. దర్శకుడు కల్యాణ్ కృష్ణ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. ఈ సినిమాలో నాగచైతన్యనీ తీసుకొచ్చి... అక్కినేని మల్టీస్టారర్ చేయాలన్నది దర్శకుడి ఆలోచన. నాగ్ కీ ఈ ఐడియా బాగా నచ్చింది. అందుకే... సీక్వెల్ కి ఓకే చెప్పాడు. కానీ... ఆ సినిమా వాయిదా పడుతూనే వచ్చింది. ఎట్టకేలకు `బంగార్రాజు` మొదలు కాబోతోంది. వచ్చే నెలలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది.
అయితే.. నాగచైతన్య చేతుల్లోంచి మాత్రం ఈ ప్రాజెక్టు చేజారిపోయేట్టు కనిపిస్తోంది. ఈ సినిమాలో చైతూ నటించే అవకాశాలు లేవు. ఆస్థానంలో మరో యంగ్ హీరోని తీసుకుంటార్ట. నాగచైతన్య కాల్షీట్లు దొరక్కే.. ఈ సినిమా ఇప్పటి వరకూ ఆలస్యం అవుతూ వచ్చింది. చైతూ వరుస సినిమాలతో బిజీగా ఉండడం వల్ల `బంగార్రాజు`కి కాల్షీట్లు ఇవ్వలేకపోయాడు.
అయితే... దర్శకుడ్ని ఇంకా వెయిట్ చేయించడం ఇష్టంలేని నాగార్జున.. కల్యాణ్ కి ఇంకో ఆప్షన్ ఇచ్చాడట. చైతూ బదులుగా మరొకరి కాల్షీట్లు సంపాదించమని చెప్పాడట. దాంతో... రామ్, నాగశౌర్య, వరుణ్ తేజ్... ఇలా యంగ్ హీరోల్ని ఒప్పించే పనిలో పడ్డాడు దర్శకుడు. ఈ సినిమా మొదలయ్యేలోపు... నాగచైతన్య ఏమాత్రం ఖాళీ చేసుకుని కాల్షీట్లు ఇచ్చినా.. బంగార్రాజులో.. చైతూ ఉంటాడు. లేదంటే మరో హీరోతో సర్దుకుపోవాల్సివస్తుంది.