ఈమధ్య డబ్బింగ్ సినిమాలకు తెలుగునాట మంచి గిరాకీనే కనిపిస్తోంది. మొన్న విక్రమ్, నిన్న కాంతారకు మంచి లాభాలొచ్చాయి. పొన్నియన్ సెల్వన్‌కు కూడా ఓపెనింగ్స్ బాగున్నాయి. అందుకే డబ్బింగ్ సినిమాలపై ఆసక్తిగా చూస్తున్నారు తెలుగు నిర్మాతలు. ఈనెల 21న `సర్దార్` విడుదల అవుతోంది. కార్తి నటించిన సినిమా ఇది. మిత్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తోంది. కార్తి సినిమా అంటే.. మామూలుగానే గిరాకీ బాగుంటుంది. దానికి తోడు... ఖైదీ తెలుగులో సూపర్ హిట్టయ్యింది. మొన్నటి పొన్నియన్ సెల్వన్ లోనూ కార్తీనే హీరో. అందుకే ఈ సినిమాపై ఫోకస్ పెరిగింది. సర్దార్ తెలుగు రైట్స్ ని నాగార్జున కేవలం 8 కోట్లకే కొనేసినట్టు టాక్. రూ.8 కోట్లంటే మంచి బేరమే. సినిమాకి ఏమాత్రం పాజిటీవ్ టాక్ వచ్చినా... తొలి మూడు రోజుల్లోనే పెట్టుబడి రాబట్టుకోవొచ్చు. పైగా ఇది దీపావళి సీజన్. సర్దార్ ప్రమోషన్లని కూడా బాగానే చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నాగార్జున అతిథిగా వస్తున్నారు.
విక్రమ్ సినిమాని శ్రేష్ట్ మూవీస్ రూ.6 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సినిమా ఏకంగా రూ.20 కోట్లు వసూలు చేసింది. కాంతార కూడా అంతే. ఈ సినిమాని రూ.5 కోట్లకు కొంటే.. రెండు రోజుల్లోనే లాభాలొచ్చాయి. మరి సర్దార్ ఏమాత్రం వసూలు చేస్తుందో తెలియాలి. సర్దార్ కి దాదాపు ప్రపంచ వ్యాప్తంగా రూ.80 కోట్ల బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కార్తి సినిమాల్లో ఇదో రికార్డు.