ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటునాటు పాట ఆస్కార్ సొంతం చేసుకున్న అపూర్వ క్షణమిది. మొత్తం దేశం గర్వించదగ్గ ఘట్టం. తొలి భారతీయ సినిమా ఒక కేటగిరీలో ఆస్కార్ ని సొంతం చేసుకుంది. అది తెలుగు సినిమా కావడం అందరికీ గర్వకారణం. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ పై అభినందనల జల్లు కురుస్తోంది. అయితే నందమూరి బాలకృష్ణ తెలిపిన అభినందన మాత్రం ఒక చర్చకు తావిచ్చింది.
బాలకృష్ణ అభినందన ఇలా వుంది. ‘’ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుని గెలుపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఉత్తమ పాటగా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకోవడం భారతీయ సినీ చరిత్రలో అపూర్వ ఘట్టం. తెలుగు జాతితో పాటు దేశం గర్వించదగిన విజయమిది. స్వరకర్త కీరవాణి గారికి, గీత రచయిత చంద్రబోస్ గారికి, దర్శకుడు రాజమౌళి గారికి, నృత్య దర్శకుడు ప్రేమరక్షిత్ గారికి, గాయకులు రాహుల్ సిప్లిగంజ్ గారికి మరియు కాలభైరవ గారికి, ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు. అలాగే డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకున్న భారతీయ చిత్రం ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ చిత్ర బృందానికి అభినందనలు’’ తెలిపారు బాలకృష్ణ.
ఆస్కార్ అవార్డులని గెలుచుకున్న రెండు చిత్రాలని బాలయ్య అభినందించడం బావుంది. ఆర్ఆర్ఆర్ విషయానికి వస్తే.. భారతీయ సినీ చరిత్రలో అపూర్వ ఘట్టమని, తెలుగు జాతితో పాటు దేశం గర్వించదగిన విజయమిదని చెప్పడం కూడా గొప్పగా వుంది. నిజంగానే ఇది దేశం గర్వించదగ్గ విజయం. అయితే బాలయ్య అభినందనలో కొన్ని పేర్లు ఆయన ప్రస్తావించకపోవడం ఇప్పుడు చర్చకు దారితీశాయి. కీరవాణి, చంద్రబోస్, రాజమౌళి, ప్రేమరక్షిత్ , రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఇలా అందరిపేర్లు ప్రస్థావించిన బాలకృష్ణ.. కథానాయకులైనఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్లని చెప్పకపోవడం ఇద్దరి అభిమానులని బాధించింది.
ఎన్టీఆర్, బాలకృష్ణ కి మధ్య ఏవో మనస్పర్ధలు వున్నాయని చెబుతుంటారు. ఆ కారణం చేతే బాలకృష్ణ ఎన్టీఆర్ పేరుని ప్రస్థావించడానికి ఇష్టపడలేదని, ఒకవేళ చరణ్ పేరు చెబితే మళ్ళీ ఎన్టీఆర్ పేరుని వదిలేసినట్లవుతుందని భావించి.. ఇద్దరి హీరోల పేర్లని తప్పించేశారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అయితే మరి కొందరుమాత్రం అసలు ఈ అవార్డు వచ్చింది కీరవాణి, చంద్రబోస్ లకి. ఆస్కార్ అకాడమీలో కూడా విజేతల పేర్లలో ఈ ఇద్దరి పేర్లే వుంటాయి. అందుకే బాలకృష్ణ కూడా ఒక పద్దతి ప్రకారమే పేర్లని జతచేశారని కొందరు అంటున్నారు. అయితే ఈ వాదనపై కూడా ప్రతి వాదన వినిపిస్తోంది. కీరవాణి, చంద్రబోస్ లకు అవార్డ్ వచ్చినపుడు మరి రాజమౌళి, ప్రేమరక్షిత్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పేర్లని బాలయ్య ఎందుకు ప్రస్థావించారు ? అనే ప్రశ్న ఉత్పన్నమౌతుంది.
ఎదేమైనా నాటునాటు పాటకు ఆస్కార్ రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి.. ఎన్టీఆర్, రామ్ చరణ్ ల డ్యాన్స్. ఆ పాటని ప్రపంచవ్యాప్తం చేసింది ఎన్టీఆర్ రామ్ చరణ్ ల ఆకర్షణీయమైన నృత్యాలు. నాటునాటు హుక్ స్టెప్ ఖండాలు దాటింది. అందరి దృష్టిని ఆకర్షించేలా చేసింది. నాటు నాటు పాటని ప్రత్యేక ఆకర్షణగా నిలిపింది. రెహ్మాన్ స్వరపరిచి ఆస్కార్ విజేతగా నిలిచిన జయహో పాట విడిగా కూడా వినొచ్చు. కానీ నాటు నాటు అలా కాదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లేకపోతే ఆ పాటకు ఇంత అందం రాదు. ఈ ఆస్కార్ విజయంలో ఇంత కీలక పాత్ర పోషించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు అన్ని అభినందనలు దక్కుతాయి. అలాంటిది బాలకృష్ణ ఆ ఇద్దరి పేర్లు చెప్పకపోవడం అభిమానులని బాధించింది.
హార్డ్ కోర్ నందమూరి ఫ్యాన్స్ ఆవేదన:
ఎన్టీఆర్, బాలకృష్ణల మధ్య ఎలాంటి స్పర్ధలు వున్నాయో తెలీదు. ఎక్కడ కనిపించినా ఎడమొహం పెడ మొహంగానే వుంటారు. మొన్న తారకరత్న పెద్ద కర్మలో కూడా ఎన్టీఆర్ ని చూసి మొహం చాటేశారు బాలకృష్ణ. ఎన్టీఆర్ కూడా ఒక అడుగు ముందుకు రాలేదు. అయితే ఇప్పుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు మనవడు నటించిన ఓ పాటుకు ఆస్కార్ వచ్చింది. నందమూరి అభిమానులు అనందంతో పొంగిపోతున్న క్షణం ఇది. అలాంటిది నందమూరి కుటుంబానికి పెద్దదిక్కుగా వున్న బాలకృష్ణ .. కనీసం ఎన్టీఆర్ పేరుని ప్రస్థావించడానికి కూడా ఇష్టపడకపోవడం నందమూరి కుటుంబాన్ని అమితంగా అభిమానించే అభిమానులని సైతం ఆవేదనకు గురి చేసింది. ‘’బాలయ్య.. ఎన్టీఆర్ పేరుని పలకడానికి మనసొప్పుకోలేదా? దేశం గర్వించే ఘనత సాధించిన ఎన్టీఆర్ కు మీ నుంచి ఒక అభినందన ఆశించాం బాలయ్య గారు.. ఎన్టీఆర్ పేరు పలికివుంటే మీ గౌరవం హుందాతనం ఇంకా పెరిగేది’’ అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు తమ మనసులోని మాటలని పంచుకుంటున్నారు.