ఓబేబీ లాంటి సూపర్ హిట్ తీసిన దర్శకురాలు నందినిరెడ్డి. అదేంటో.. ఆసినిమా హిట్టయినా, తదుపరి సినిమా పట్టాలెక్కించడంలో జాప్యం జరుగుతూనే ఉంది. వైజయంతీ మూవీస్ లో నందిని రెడ్డి ఓ సినిమా చేయాలి. కథ రెడీ. అయితే హీరోనే దొరకడం లేదు. హీరోలంతా బిజీగా ఉండడం వల్ల, నందిని రెడ్డి ఎదురుచూపుల్లో పడిపోయింది. అయినా ఎంతకాలమని హీరోల కోసం చూస్తూ.. సినిమాని హోల్డ్ లో పెడుతుంది? అందుకే ఇప్పుడు ఓ కుర్ర హీరోతో సర్దుకుపోవడానికి రెడీ అయిపోయింది. నందిని తదుపరి సినిమా సంతోష్ శోభన్ తో అని టాలీవుడ్ టాక్.
ఏక్ మినీ కథతో.. ఆకట్టుకున్నాడు సంతోష్ శోభన్. ఇది వరకు తన నుంచి రెండు సినిమాలొచ్చినా, అవేం సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఏక్ మినీ కథకు ఓటీటీ ద్వారా నిర్మాతలకు లాభాలొచ్చాయి. దాంతో సంతోష్ శోభన్ నందినిరెడ్డి దృష్టిలో పడ్డాడు. త్వరలోనే ఈసినిమాకి సంబంధించిన ఓ అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి.