ఓ బేబీతో సూపర్ హిట్టు కొట్టింది నందినిరెడ్డి. అయితే తదుపరి సినిమాని పట్టాలెక్కించడానికి చాలా కాలం పట్టింది. ఇప్పుడు లేటెస్టుగా తన కొత్త సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. నందినిరెడ్డి దర్శకత్వంలో స్వప్న సినిమాస్ పతాకంపై ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సంతోష్ శోభన్ హీరో. ఈ చిత్రానికి `అన్నీ మంచి శకునములే` అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ టైటిల్ కి సంబంధించిన చిన్న టీజర్ కూడా విడుదల చేశారు. రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్.. ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హీరోయిన్ ఎవరన్నది ఫిక్స్ అవ్వాల్సివుంది.
ఏక్ మినీ కథతో... ఓటీటీ హీరో అయిపోయాడు సంతోష్ శోభన్. మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న `మంచి రోజులొచ్చాయి` లో తనే హీరో. ఈ సినిమా ఓటీటీకే. ఇప్పుడు నందిని రెడ్డి దర్శకత్వంలో ఛాన్స్ కొట్టేశాడు. ఈ సినిమా మాత్రం థియేటరికల్ రిలీజ్ నే లక్ష్యంగా పెట్టుకుని రూపొందిస్తున్నార్ట. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.