నాని ఏం త‌ప్పు చేశాడ‌ని?

మరిన్ని వార్తలు

నాని పై ఎగ్జిబీట‌ర్లు కారాలు, మిరియాలూ నూరేస్తున్నారు. `నాని ఓ పిరికివాడు.. సినిమాల్లోనే హీరో` అంటూ కొంత‌మంది ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. నాని సినిమాల్ని ఇక మీద‌ట థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌కూడ‌ద‌ని గ‌ట్టిగా డిమాండ్ చేస్తున్నారు. నాని సినిమా `ట‌క్ జ‌గ‌దీష్‌` ఇప్పుడు ఓటీటీల‌కు వెళ్లిపోవ‌డ‌మే అందుకు కార‌ణం. థియేట‌ర్ వ్య‌వ‌స్థ అధ్వానంగా త‌యార‌వుతున్న వేళ‌.. సినిమాల్ని థియేట‌ర్ల‌లో విడుద‌ల చేసి, థియేట‌ర్ల మ‌నుగ‌డ‌కు స‌హాయ‌ప‌డాల్సిన త‌రుణంలో నాని ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం ఎవ‌రికీ నచ్చ‌డం లేదు. అందుకే అంత ఫైర్‌.

 

నిజానికి ఇందులో నాని త‌ప్పు ఏముంది? సినిమాల్ని ఎక్క‌డ‌, ఎప్పుడు, ఎలా విడుద‌ల చేసుకోవాల‌న్న‌ది నిర్మాత‌ల ఇష్టం. ప్ర‌స్తుత‌మున్న ప‌రిస్థితుల్లో ఈ సినిమాని ఓటీటీలో విడుద‌ల చేయ‌డ‌మే న‌యం అని నిర్మాత‌లు భావించారు. అందుకే ఆ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ సినిమాని ఎట్టిపరిస్థితుల్లోనూ థియేట‌ర్ల‌లోనే విడుద‌ల చేయాల‌ని నాని కూడా అనుకున్నాడు. ఈ విష‌య‌మై నిర్మాత‌ల‌తో చ‌ర్చించాడు కూడా. చివ‌రికి నిర్మాత‌ల మాటే నెగ్గింది. వాస్త‌వానికి.. నిర్మాత‌లకు కూడా మ‌రో దారి లేదు. ఈ సినిమా ఎప్పుడో పూర్త‌య్యింది. ఇంకా... హోల్డ్ చేసుకుని పెట్టుకుంటే వ‌డ్డీల భారం పెరిగిపోతుంది. అప్పుడు థియేట‌ర్ల‌లో విడుద‌ల చేసినా లాభం లేదు. అందుకే... ఓటీటీ బాట ప‌ట్టాల్సివ‌చ్చింది. ఏ ప‌రిస్థితుల్లో.. ఈ సినిమాని ఓటీటీకి ఇవ్వాల్సివ‌చ్చిందో, స్ప‌ష్టం చేస్తూ నిర్మాత‌లు ఓ లేఖ కూడా విడుద‌ల చేశారు. మ‌రి ఈ విష‌యంలో నానిని ఎందుకు బ‌లి ప‌శువుని చేస్తున్నారో?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS