ఫ్లాప్ అన్న మాట తెలియకుండా సాగుతోంది నేచురల్ స్టార్ నాని కెరీర్ ఇటీవలి కాలంలో. హిట్టు మీద హిట్టు, మళ్ళీ హిట్టు, ఆపై ఇంకో హిట్టు ఇలా నాని ఏ సినిమా చేసినా బంపర్ హిట్ అవుతూ వస్తోంది. నానితో సినిమా అంటే నిర్మాతలు ఎగిరి గంతేస్తున్నారంతే. చిన్న నిర్మాతలకెలాగూ నాని బెస్ట్ ఆప్షన్, పెద్ద నిర్మాతలు కూడా నానితో సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. ముందుకు రావడం కాదు, నానితో మంచి మంచి సినిమాలు చేస్తూ తమ బ్యానర్ వాల్యూని పెంచేసుకుంటున్నారు. దటీజ్ నాని. తెలుగు రాష్ట్రాల్లో నాని సినిమాలు కాసుల వర్షం కురిపిస్తోంటే, ఓవర్సీస్‌లోనూ అదే పరిస్థితి. నాని లేటెస్ట్ హిట్ 'నిన్నుకోరి'కి ఓవర్సీస్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. 1 మిలియన్ క్లబ్‌లో అప్పుడే 'నిన్నుకోరి' చిత్రాన్ని చేర్చేశారు. ఈ సినిమాతో నాని రేంజ్ ఓవర్సీస్ మార్కెట్‌లో మరింత పెరిగిపోయిందనడం నిస్సందేహం. సాధారణంగా మంచి హిట్ వస్తే, భారీ బడ్జెట్ సినిమా గురించి ఏ హీరో అయినా ఆలోచిస్తాడు. నాని అలా కాదు, తన రేంజ్ పెంచేసుకోవడం కాకుండా చేసే సినిమా విడుదలయ్యాక రేంజ్ పెంచుకోవాలని అనుకుంటుంటాడు. ఇదే నాని సక్సెస్ సీక్రెట్ కావొచ్చు. నాని అంటే నేచురల్ స్టార్, పక్కింటి కుర్రాడు. ఏ సినిమా చేసినా నాని అందులో అలాగే కనబడతాడు. అందుకే నాని సినిమాలకి యూత్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయిపోతారు. మనోడి సినిమా అనే ఆలోచనతోనేమో నాని సినిమాలకి హిట్ మీద హిట్ అందించేస్తున్నారు ఆడియన్స్. ఏ హీరోకైనా ఇంతకన్నా మంచి గుర్తింపు ఇంకేముంటుంది?