నాని 25వ సినిమా `వి`. ఇదో మైలు రాయి సినిమాలా మిగిలిపోవాలని నాని భావించాడు. అందుకే తొలిసారి విలన్ పాత్రలో కనిపించాడు. అయితే నానిని అన్ని విధాలా నిరుత్సాహపరిచింది `వి`. లాక్ డౌన్ వల్ల థియేటర్లలో విడుదల కాలేకపోయింది. ఓటీటీలోకి వచ్చినా - జనం చూళ్లేదు. పైగా ఫ్లాప్ టాక్ వచ్చింది. నాని ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నాడో అనే కామెంట్లూ వినిపించాయి. ఇటీవల జెమినీ లో ఈ సినిమా టెలీకాస్ట్ అయ్యింది. అక్కడా రేటింగులు చాలా తక్కువ వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. జనవరి 1న `వి` థియేటర్లలో రాబోతోంది.
కొత్త సంవత్సరం కానుకగా ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేస్తున్నామని దిల్ రాజు ప్రకటించారు. ``నానికి ఇది 25వ సినిమా. చాలా ప్రత్యేకంగా ఉండాలనుకున్నాం. కానీ థియేటర్లలో విడుదల చేయకలేపోయాం. ఓటీటీలో చూడాల్సివచ్చింది. ఆలోటు తీర్చడానికి `వి`ని థియేటర్లలో విడుదల చేస్తున్నాం`` అని దిల్ రాజు చెప్పారు. ఓటీటీలోనూ, టీవీలోనూ చూడని సినిమా థియేటర్లలో, టికెట్టు పెట్టి చూస్తారా, అదీ... కరోనా సమయంలో..? అన్నది అతి పెద్ద ప్రశ్న. కనీసం ఈ సినిమాకి కొన్ని టికెట్లయినా తెగితే, దిల్ రాజు ప్రయత్నం నెరవేరుతుంది.