67వ జాతీయ అవార్డుల్ని ఇటీవలే ప్రకటించారు. తెలుగు చిత్రసీమకు 4 అవార్డులొచ్చాయి. జెర్సీ, మహర్షి సినిమాలు చెరో రెండూ పంచుకున్నాయి. తెలుగు సినిమాకి 4 అవార్డులు రావడం విశేషమే. కాకపోతే.. ఓ చిన్న సినిమాకు జాతీయ అవార్డుల విషయంలో అన్యాయం జరిగిందని, సినీ విమర్శకులు, విశ్లేషకులు వాపోతున్నారు. ఆ చిన్న సినిమానే మల్లేశం.
చేనేత కార్మికుడు మల్లేశం జీవిత కథ ఇది. ప్రియదర్శి కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసల్ని అందుకుంది. దర్శకుడు ఈ సినిమాని కళాత్మకంగా తీశాడని, బాధ్యత ఉన్న సినిమా అంటూ.. విమర్శకులు మెచ్చుకున్నారు. ఉత్తమ చిత్రంగా సినీ అభిమానులు, సెలబ్రెటీల మన్ననల్ని అందుకుంది. అయినా సరే.. ఈ సినిమాకి జాతీయ స్థాయిలో గుర్తింపు రాలేదు. పోనీ... మల్లేశం కంటే గొప్ప సినిమాలకు అవార్డులు వచ్చాయా అంటే అదీ లేదు.
`జెర్సీ`కి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు ఇవ్వడంలో తప్పులేదు. కాకపోతే మహర్షి స్థానంలో మల్లేశం కు అవార్డు వస్తే, చిన్న సినిమాలకు ప్రోత్సాహకరంగా ఉండేదని పలువురు సినీ విశ్లేషకులు, విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ విధంగా... మల్లేశంకు అన్యాయం జరిగినట్టే.