సినిమా థియేటర్లు మూత పడడంతో గత నాలుగు నెలలుగా సినిమా రిలీజులు లేవు. దీంతో ఫిలింమేకర్లు ఓటీటీ వేదికల ద్వారా రిలీజులు ప్లాన్ చేస్తున్నారు. ప్రేక్షకులు కూడా ఈమధ్య ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సినిమాలు, వెబ్ సీరీసులు చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని నెలల పాటు సినిమా థియేటర్లు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో ఓటీటీ వేదికల పాపులారిటీ భారీగా పెరిగింది. అమెజాన్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ + హాట్ స్టార్ లాంటి లీడింగ్ ఓటీటీ ప్లేయర్స్ భారీ సంఖ్యలో సినిమాలను తమ వేదికల ద్వారా రిలీజులు ప్లాన్ చేస్తున్నారు.
ఈమధ్యే డిస్నీ + హాట్ స్టార్ వారు బాలీవుడ్ కి హోమ్ డెలివరీ పేరుతో 7 సినిమాలను రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. ఇదే కోవలో తాజాగా నెట్ ఫ్లిక్స్ వారు రాబోయే రెండు మూడు నెలల్లో 17 సినిమాలను, వెబ్ సీరీసులను రిలీజులు ప్లాన్ చేస్తున్నారు. త్రిభంగ, లుడో, డాలీ కిట్టీ ఔర్ చమక్తే సితారే, తోర్బాజ్, ఏకె Vs ఏకె, గుంజన్ సక్సేనా, జిన్నీ వెడ్స్ సన్నీ, తేడి మేడి క్రేజీ, క్లాస్ ఆఫ్ 83, బాంబే రోజ్, సీరియస్ మెన్, కాలి ఖుహి, రాత్ అకేలీ హై అనే సినిమాలతో పాటుగా ఆరు వెబ్ సీరీసులు కూడా రిలీజ్ చేస్తున్నారు.
డిస్నీ +హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్ లు ఈ కొత్త సినిమాల జాతరకు తెరతీయడంతో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ జోరు పెంచే ప్రయత్నాలలో ఉన్నారని అర్థం అవుతోంది. మిగతా ఓటీటీ వేదికలు కూడా ఇదే విధంగా కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయమే.