చిత్తోర్‌గడ్ రాణి పద్మిని జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'పద్మావతి'. దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించారు. ఈ సినిమాపై ఇటీవల దేశ వ్యాప్తంగా వచ్చిన ఆందోళనల సంగతి తెలిసిందే. ఆందోనలు ఉదృతరూపం దాల్చడంతో సినిమా విడుదల ఆగిపోయింది. ఇదిలా ఉండగా, తాజాగా మరో 'పద్మావతి' వచ్చేస్తోందట. ప్రముఖ నిర్మాత అశోక్ శేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారట. రాజస్థాన్‌కి చెందిన ఓ ప్రముఖ రచయిత ఈ చిత్రానికి స్టోరీ ప్రిపేర్ చేస్తున్నారట. సినిమా అంతా రాజస్థాన్‌లోనే చిత్రీకరించనున్నారట.
భన్సాలీ తెరకెక్కించిన చిత్రంలో చరిత్రని వక్రీకరించాడంటూ ఆరోపణలున్నాయి. అయితే ఈ సినిమాలో అసలు సిసలైన రాణి పద్మిని జీవిత చరిత్రను వాస్తవాలతో కళ్లకు కట్టేలా చూపించనున్నామని నిర్మాత అశోక్ వెల్లడించారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ మీదికెళ్లనుందట. 'మై హూ పద్మావతి' అనే టైటిల్‌తో హిందీ, రాజస్థానీ భాషల్లో రూపొందించనున్నారట. రాజస్థాన్‌కి చెందిన కొందరు చరిత్రకారులతో వాస్తవాలను సేకరిస్తూ, ఈ సినిమాకి స్క్రిప్ట్ ప్రిపేర్ చేస్తున్నారట. భన్సాలీ చిత్రంలో ప్ర ముఖ నటీనటులు దీపికా పదుకొనె, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తే, ఈ సినిమా కోసం కొత్త నటీనటులను ఎంపిక చేసుకోనుందట చిత్ర యూనిట్.
ఇకపోతే భన్సాలీ చిత్రం 'పద్మావతి' భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం. రాజ్‌పుత్ కర్ణిసేన ఆందోళనలతో ఈ సినిమాని బీహార్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బ్యాన్ చేశారు. ఇక మిగిలిన రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదలవుతుందా? అంటే అదీ స్పష్టత లేదు. ఈ లోగా ఈ కొత్త 'పద్మావతి' చర్చకొచ్చింది. భన్సాలీ చిత్రం సంగతి అలా ఉండగానే, అశోక్ నిర్మాణంలో ఈ సినిమా పూర్తయిపోయి, ప్రేక్షకుల ముందుకొచ్చేస్తుందో ఏమో చూడాలి మరి.