తమిళ తంబీలు అంతే. ఏదొచ్చినా ఆపుకోలేరు. హీరోల పై అభిమానం కురిపించడంలో, వాళ్లని దేవుళ్లుగా చేసుయడంలోనూ.. వాళ్లెప్పుడూ స్పీడే. హీరోయిన్లకు గుడి కట్టిన చరిత్ర.. తమిళ అభిమానుల సొంతం. స్టార్ హీరోయిన్లకే కాదు... అప్పుడే ఇండ్రస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్లపై కూడా వాళ్లు ఇలాంటి అభిమానమే కురిపిస్తుంటారు. తాజాగా.. తమిళనాట.. నిధి అగర్వాల్ కి ఓ గుడి వెలిసింది.
`ఇస్మార్ట్ శంకర్` లాంటి మాస్ సినిమాతో.. నిధికి మంచి పేరొచ్చిన సంగతి తెలిసిందే. అంతకు ముందు తాను చేసిన సినిమాలన్నీ ఫ్లాపే. తమిళనాట కూడా తాను ఉద్ధరించింది ఏమీ లేదు. సామాజిక సేవ లాంటి పనులు కూడా పెద్ద గా చేసిందేం లేదు. అయినా సరే... ప్రేమికుల రోజు సందర్భంగా... నిధికి తమిళనాడులో ఓ గుడి కట్టి, పాలాభిషేకాలు చేశారు. పూజా పునస్కారాలు మొదలెట్టారు. ఇప్పుడు ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
సోనూసూద్ కి గుడి కట్టారంటే ఓ అర్థం ఉంది. కరోనా కాలంలో.. సోనూ చేసిన సేవలు అలాంటివి. కానీ నిధి ఏం చేసిందో.. మరి. ఇది కచ్చితంగా ఓవర్ యాక్షనే అని కొంతమంది బాహాటంగా నవ్వుకుంటుంటే.... తమిళ తంబీలు మాత్రం తమ అభిమానం ఇలానే ఉంటుందని... కాలర్ ఎగరేసి మరీ చెబుతున్నారు. ఇంతకీ ఈ విషయం నిధికి చేరిందో లేదో?