డ్రగ్స్ వ్యవహారంతో టాలీవుడ్ మరోసారి ఉలిక్కి పడింది. ఈసారి కూడా సినీ సెలబ్రెటీల పేర్లు బయటకు వచ్చాయి. పట్టుబడ్డ వారిలో.. సినిమా వాళ్లు తక్కువే ఉన్నా, అదేదో.. డ్రగ్స్ అంటేనే సినిమా వాళ్లన్నట్టు టీవీ ఛానళ్లలో డిబేట్లు హోరెత్తిపోతోంది. ముఖ్యంగా నిహారిక పేరు ఈ లిస్టులో ఉండడంతో మరింత హాట్ టాపిక్‌గా మారింది. నిహారిక ఆ పబ్‌లో ఏం చేస్తోంది? తను డ్రగ్స్ తీసుకుందా, లేదా? అనేది ఇంకా స్పష్టం కాలేదు. నిజానిజాలు బయటకు రావడానికి కాస్త సమయం పడుతుంది. అయితే ఈలోగా.. నిహారిక నిందలు మోయాల్సివస్తోంది.
అయితే ఈ డామేజ్ తనకు మాత్రమే కాదు. తన కుటుంబానికీ.. పరోక్షంగా పవన్ కల్యాణ్‌కి కూడా. బాబాయ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు సమాయాత్తం అవుతున్నాడు. ఇలాంటి సందర్భంలో నిహారిక పేరు డ్రగ్స్ వ్యవహారంలో బయటకు రావడం నిజంగా ఇబ్బంది పెట్టే విషయమే. పవన్ ని టార్గెట్ చేసుకునే ప్రత్యర్థులకు ఆయుధాన్ని ఇచ్చినట్టైంది. నాగబాబుకీ ఇది డామేజింగ్ విషయమే. ఎందుకంటే.. ఆయన సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. ప్రభుత్వంపై విసుర్లు విసురుతుంటారు. ఇప్పుడు ఆయన్ని టార్గెట్ చేయడం మరింత ఈజీ అయిపోయింది. ఏది ఏమైనా సెలబ్రెటీలు, ముఖ్యంగా జనాదరణ ఉన్నవాళ్లు, జనాల నమ్మకాన్ని సంపాదించినవాళ్లు.. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క తప్పు చేసినా దొరికిపోతారు. అన్ని వేళ్లూ తమ వైపు చూపించే అవకాశాన్ని ఇచ్చినవాళ్లు అవుతారు. అందుకు నిహారిక ఉదంతం మరో పాఠం.