ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌కి సరైన సినిమాలు పడలేదనే చెప్పాలి. సినిమాల సీజన్ అయిన సంక్రాంతి వరుస ఫెయిల్యూర్స్‌తో వేస్ట్ అయ్యింది. ఇక ఆ తరువాత వచ్చిన సినిమాల్లో కూడా పెద్దగా సక్సెస్ మూవీస్ లేవు. ఇటీవల కాలంలో విడుదలైన పెద్ద సినిమాల్లో 'భాగమతి', చిన్న సినిమాల్లో 'ఛలో' మాత్రం కొంచెం ఫర్వాలేదనిపించాయి, తప్ప అంతకు మించి పెద్దగా చెప్పుకోదగ్గ హిట్ సినిమాలు లేవు. ఇప్పుడు మళ్లీ చిన్నా, పెద్దా సినిమాలు వరుస కడుతున్నాయి.
వాటిలో ముందుగా వస్తున్నాడు యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నిఖిల్. ఈ నెల 16న నిఖిల్ నటించిన 'కిర్రాక్ పార్టీ' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కన్నడలో ఘన విజయం సాధించిన 'కిరిక్ పార్టీ' సినిమాకి ఇది తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతోంది. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'కేశవ' చిత్రాలతో నిఖిల్ కెరీర్ దాదాపు ఫామ్‌లోనే ఉంది. సో ఈ సినిమాపై కూడా అంచనాలున్నాయి. అందులోనూ కాలేజ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా ఇది. కాలేజ్ నేపథ్యంలో వచ్చి సూపర్ హిట్ కొట్టిన 'హ్యాపీడేస్' మూవీ నిఖిల్ డైరీలో ఉంది. ఆ సెంటిమెంట్ కూడా ఈ సినిమాకి కలిసొచ్చేలా ఉంది. అందులోనూ 'హ్యాపీడేస్' కళే ఈ సినిమాకి కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే, ఈ టైం ఎగ్జామ్స్ సీజన్. దీన్ని దాదాపు సినిమా లెక్కల్లో డ్రై సీజన్‌గా లెక్కేస్తుంటారు. మరి ఈ సీజన్‌లో కాలేజీ స్టూడెంట్స్ టార్గెట్‌గా విడుదలవుతున్న ఈ సినిమాతో నిఖిల్ ఎలా హిట్టు కొడతాడన్ననే డౌట్. అయితే ఎగ్జామ్స్ సీజన్‌లో స్టూడెంట్స్‌కి రీఫ్రెష్‌మెంట్‌గా ఈ కిర్రాక్ పార్టీ సినిమా ఉండబోతోందనీ భావిస్తున్నారు మరోపక్క. చూడాలి మరి తన 'కిర్రాక్ పార్టీ'తో స్టూడెంట్స్‌ని నిఖిల్ ఎలా ఎట్రాక్ట్ చేస్తాడో!