ఏ హీరోకైనా సరే, తనకున్న మార్కెట్ ని బట్టి పెట్టుబడి పెట్టాలి. పది రూపాయల మార్కెట్ ఉన్న హీరోని తీసుకొంటే.. కనీసం 7 రూపాయల్లో సినిమా పూర్తి చేయాలి. అది బిజినెస్ సూత్రం. పది రూపాయల హీరోతో... 20 రూపాయల సినిమా తీస్తే.. నష్టపోతారు. సినిమాపై, వ్యాపారంపై కనీస అవగాహన ఉన్నవాళ్లెవరైనా... ఈ తప్పు చేయరు. కానీ... సినిమాల్లో మాత్రం ఇలాంటి తప్పులు జరుగుతాయి. కార్తికేయ 2 అందుకు తాజా సాక్ష్యం.
నిఖిల్ - చందూ మొండేటి కాంబినేషన్‌లో రూపొందిన కార్తికేయ మంచి విజయాన్ని అందుకొంది. దాంతో కార్తికేయ 2 కి రంగం సిద్ధమైంది. తొలుత ఈ సినిమాని రూ.15 కోట్లలో పూర్తి చేద్దామనుకొన్నారు. నిజానికి ఇది మంచి డీల్. ఎందుకంటే డిజిటల్ రైట్స్ రూపంలో ఈ సినిమా ప్రారంభించిప్పుడే రూ.14 కోట్లు వచ్చాయి. అంటే.. థియేటర్ నుంచి ఎంత వచ్చినా అదంతా లాభమే అన్నమాట. రూ.15 కోట్లలో సినిమాని పూర్తి చేసి ఇస్తానన్న దర్శకుడు... చివరికి రూ.30 కోట్ల బడ్జెట్ అవ్వగొట్టాడని టాక్. అయినా సినిమా ఇంకా పూర్తవలేదు. ప్రమోషన్లకు మరింత ఖర్చు పెట్టాలి. దానికి మరో రూ.3 కోట్లు వేసుకొన్నా.. ఈ సినిమాకి మొత్తం రూ.33 కోట్లు అయినట్టు. ఇప్పటికే డిజిటల్ రైట్స్ రూపంలో 14 కోట్లు వచ్చాయి. ఇప్పుడు థియేటరికల్ నుంచి కనీసం 20 కోట్లు రావాలి. నిఖిల్ సినిమాకి రూ.20 కోట్లు రావాలంటే ఏవో అద్భుతాలు జరగాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో థియేటరికల్ బిజినెస్ ఏమాత్రం బాలేదు. ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి జంకుతున్నారు. ఈ పరిస్థితుల్లో నిఖిల్ సినిమాకి రూ.20 కోట్లు రాబట్టడం కష్టమే.