అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే... ఇలా స్టార్లకు ఏమాత్రం కొదవ లేని చిత్రం `నిశ్శబ్దం`. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం... ఇలా నాలుగు భాషల్లోనూ అక్టోబరు 2న విడుదల అవుతోంది. నిజానికి థియేటర్‌లోనే ఈ సినిమాని విడుదల చేద్దామనుకున్నారు. కానీ.. థియేటర్లు ఎంతకీ తెరవకపోవడంతో అమేజాన్ ప్రైమ్ చేతిలో పెట్టేశారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు విడుదల చేశారు. ట్రైలర్ థ్రిల్లింగ్ గా అనిపించింది. ఓ ఇంట్లో.. పెయింటింగ్ కోసం ఓ జంట చేసిన ప్రయత్నంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఈసినిమా సాగబోతోంది.
అనుష్క మూగమ్మాయిగా నటిస్తోంది. మాధవన్ ఓ సంగీత కారుడు. వారిద్దరి మధ్య ఉన్న బంధమేంటి? అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతోంది? అనేది ఆసక్తికరం. హాలీవుడ్ నిపుణుల సహకారం తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆ క్వాలిటీ కనిపించింది. సినిమా విడుదలలో జాప్యం జరిగినా.. ఈసినిమాపై క్రేజ్ తగ్గలేదు. దానికి అనుష్కనే కారణం. అనుష్క చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మంచి ఆదరణే పొందాయి. ఆ కోవలో ఈ సినిమా కూడా చేరుతుందన్న నమ్మకం కలుగుతోంది.