కమల్ హాసన్ నటించిన `విక్రమ్`ని తెలుగులో నితిన్‌కి చెందిన శ్రేష్ట్ మూవీస్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ సినిమాని రూ.6 కోట్లకు దక్కించుకొంది. కమల్ సినిమా రూ.6 కోట్లంటే చాలా చీప్ అన్నమాట. కాకపోతే... గత కొన్నేళ్లుగా కమల్ సినిమాలేవీ సరిగా ఆడడం లేదు. ఫ్లాప్ టాక్ వస్తే.. పోస్టర్ ఖర్చులు కూడా రావడం లేదు. దాంతో ఈ సినిమా కొనే రిస్క్ ఎవ్వరూ చేయలేదు. శ్రేష్ట్ మూవీస్ మాత్రం ధైర్యంగా ముందడుగు వేసింది. పోటీ లేకపోవడంతో రూ.6 కోట్లకు దక్కించుకొంది. బ్రేక్ ఈవెన్ సంపాదించాలంటే రూ.6.5 కోట్లు రాబడితే చాలు.
సోమవారం నాటికి.. రూ.6.5 కోట్లూ రాబట్టేసింది. ఇప్పుడు ఎంతొస్తే అంత లాభం అన్నమాట. వచ్చే వారం `అంటే.. సుందరానికీ..` రిలీజ్ అవుతోంది. ఆ ఒక్క సినిమానే విడుదల అవుతోంది కాబట్టి.. విక్రమ్ కీ కావల్సినంత చోటు ఉంటుంది. `విక్రమ్` బీసీ ప్రేక్షకులకు బాగా పట్టేసింది. కాబట్టి.. ఈ వీకెండ్ కూడా మంచి వసూళ్లే అందుకొనే అవకాశం ఉంది. ఎంత కాదన్నా... ఈ సినిమాతో నితిన్ కి రూ.4 నుంచి 5 కోట్ల వరకూ లాభం రావొచ్చన్నది ట్రేడ్ వర్గాల మాట.