సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో శర్వానంద్ సరసన కాజల్ అగర్వాల్, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ కాంబినేషన్‌లో ఓ స్మాల్ ఛేంజ్ జరిగిందనీ తాజా సమాచారమ్. నిత్యామీనన్ ప్లేస్‌లోకి 'హలో' బ్యూటీ వచ్చిందట. ఇతరత్రా కారణాల వల్ల నిత్యామీనన్ ఈ సినిమా నుండి తప్పుకుందంటూ గాసిప్స్ వస్తున్నాయి.
దాంతో ఆ ప్లేస్‌లోకి హలో బ్యూటీ కళ్యాణీ ప్రియదర్శన్ పేరు వినిపిస్తోంది. ఈ బ్యూటీకి తెలుగులో తొలి సినిమా 'హలో'నే. తొలి సినిమానే అయినప్పటికీ, చాలా అనుభవం ఉన్న నటిలా యాక్టింగ్ టాలెంట్ చూపించిందనీ ఈ ముద్దుగుమ్మ ప్రశంసలు అందుకుంది. అలనాటి హీరోయిన్ లిజీ కూతురు ఈ కళ్యాణీ ప్రియదర్శన్. తొలి సినిమాతోనే నటనలో మంచి మార్కులేయించుకుంది. అందుకే సినిమా ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయినా కానీ ఈ బ్యూటీకి ఆఫర్లు క్యూ కడుతున్నాయట. ప్రస్తుతం శర్వానంద్ సరసన ఈ బ్యూటీ నటిస్తోందని తెలుస్తోంది.
ఈ సినిమాలో శర్వానంద్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారక్టెర్స్ పోషిస్తున్నాడనీ తెలుస్తోంది. అందులో ఒకటి గ్యాంగ్‌స్టర్ పాత్రట. అలాగే పాతికేళ్ల జోష్ ఉన్న కుర్రాడి పాత్ర కూడా పోషిస్తున్నాడట. ఈ యంగ్ స్టార్ క్యారెక్టర్ కోసమే కళ్యాణీని ఎంచుకున్నట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే కళ్యాణీ టాలెంట్‌కి తగ్గ ప్లాట్‌ఫామ్ దొరికినట్లే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు శర్వానంద్ పట్టిందల్లా బంగారమే. ఈ తరుణంలో శర్వానంద్ లాంటి హీరోతో కళ్యాణీకి ఛాన్స్ వచ్చిందంటే దశ తిరిగినట్లేగా మరి! అయితే ఈ గాసిప్‌లో నిజమెంతో తెలియాల్సి ఉంది.