ఈనెల 9న విడుదలకు సిద్ధమైంది `వకీల్ సాబ్`. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దానికి తోడు దాదాపు 90 కోట్ల మేర బిజినెస్ జరుపుకుంది. ఆ 90 కోట్లూ రాబట్టాలంటే కనీసం 100 కోట్లయినా వసూలు చేయాలి. అందుకోసం బయ్యర్లు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో అర్థరాత్రి బెనిఫిట్ షోలు వేసి, అదనపు షోల కోసం పర్మిషన్లు తెచ్చుకుని, తొలి రోజే... భారీ మొత్తం రాబట్టాలని ప్లాన్ వేశారు. బెనిఫిట్ షో టికెట్ 15 వందలుగా నిర్ణయించారు.
టికెట్ రేటు ఎంతైనా సరే... కొనేయడానికి పవన్ అభిమానులు సిద్ధంగా ఉన్నారు. కాకపోతే... ఇప్పుడు బెనిఫిట్ షోలు పడతాయా? లేదా? అనేదే పెద్ద అనుమానం. తెలుగు రాష్ట్రాలలో కరోనా విజృంభిస్తోంది. సభలూ, సమావేశాలు, పెళ్లిళ్లూ... ఇలా జనం గుమ్మిగూడే ఏ కార్యక్రమానికైనా పరిమితులు విధించడం మొదలెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో బెనిఫిట్ షోలను అనుమతులు ఇవ్వడం అసాధ్యమే. స్పెషల్ షోలకూ పర్మిషన్లు దొరికే పరిస్థితి లేదు. వంద శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుపుకోమనడమే పెద్ద వరంగా మారింది. సో... వకీల్ సాబ్ బెనిఫిట్, స్పెషల్ షోలపై ఆశలు వదులుకోవాల్సిందే. ఈ స్పెషల్ షోల ద్వారా భారీ మొత్తంలో వసూళ్లు రాబడదాం అనుకున్న బయ్యర్లకు ఇది తీవ్ర నిరాశని కలిగించే విషయమే.