దాదాపు 500 సినిమాల్లో నటించిన మోహన్‌బాబుది.. ఘన చరిత్రే. ఎన్నో సూపర్ హిట్లున్నాయి. ఫ్లాపులూ ఉన్నాయి. అయితే... తన కెరీర్‌లో దారుణమైన డిజాస్టర్ `సన్నాఫ్ ఇండియా` రూపంలో ఎదురైంది. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా రిలీజ్ కి ముందే భారీ ట్రోలింగ్ కి గురైంది. బుక్ మై షోలో అడ్వాన్స్ బుకింగులు మొదలైనా.. ఒక్క టికెట్లూ తెగడం లేదని, థియేటర్లన్నీ ఖాళీగా మిగిలిపోనున్నాయని ముందే అంచనా వేశారు. దానికి తగ్గట్టే.. శుక్రవారం థియేటర్లన్నీ ఖాళీగా మారిపోయాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 300 థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. ఉదయం ఆటకు జనాలు లేరు. చాలా థియేటర్లలో పదికి మించి టికెట్లు తెగలేదు. దాంటో మాట్నీ నాటికి.. దాదాపు వంద థియేటర్లు సినిమాని మార్చేశాయి. గత వారం విడుదలైన ఖిలాడీని మళ్లీ ప్రదర్శనకు పెట్టాయి. అగ్ర హీరోల్లో ఒకడిగా చలామనీ అయిన మోహన్ బాబు నటించిన ఓ సినిమాని... మార్నింగ్ షో ఉంచి, మాట్నీకి తీసేయడం.. నిజంగా.. దారుణమైన విషయమే. శనివారం నాటికి మరో సగం థియేటర్లు ఖాళీ కానున్నాయని అంచనా. ఓ రకంగా... సన్నాఫ్ ఇండియా వల్ల... మోహన్ బాబుకి నష్టం జరిగినా, రవితేజకు లాభం చేకూరినట్టైంది. ఈవారం ఖిలాడీకి ఇంకొన్ని అదనపు థియేటర్లు దొరికాయి.