ఎన్.టి.ఆర్. అనే మూడక్షరాలు ఓ సంచలనం. తెలుగు సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా స్వర్గీయ నందమూరి తారకరామారావు గురించే ప్రస్తావించాలి. తెలుగు రాజకీయాల గురించి మాట్లాడుకోవాలన్నా ఆయన్ను స్మరించుకోవాలి. అచ్చమైన తెలుగు భాషకు ఆయన కేరాఫ్ అడ్రస్. తెలుగుదనానికి నిలువెత్తు నిదర్శనం ఆయన. అలాంటి నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర సినిమాగా తెరకెక్కించడమంటే అదొక మహత్‌కార్యంగా అభివర్ణించక తప్పదు. తేజ దర్శకత్వంలో రూపొందుతోంది ఈ సినిమా.
సాక్షాత్తూ స్వర్గీయ ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ ఈ సినిమాలో తన తండ్రి పాత్రలో కనిపించనున్నారు. అంతే కాదు, ఈ సినిమా నిర్మాణంలోనూ బాలకృష్ణ పాలుపంచుకుంటున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ 22వ వర్ధంతి నేపథ్యంలో 'ఎన్‌టిఆర్' సినిమా పోస్టర్‌ని విడుదల చేశారు. బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో ఎన్టీయార్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న విషయం కనిపించేలా డిజైన్ చేశారు. 'యన్.టి.ఆర్.' తెలుగు అక్షరాల్లో పైన, బ్యాక్‌డ్రాప్‌లో ఇంగ్లీషు అక్షరాలు కనిపిస్తున్నాయి. ఈ స్టిల్ విడుదలైన కాస్సేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టాప్ ట్రెండింగ్‌లోకి దూసుకుపోయేలా ఉంది.
ఇటీవల నందమూరి బాలకృష్ణపై కొన్ని సీన్స్ చిత్రీకరించారనీ, అదంతా టీజర్ కోసమేనని టాక్ వినవచ్చింది. అయితే దానికి సంబంధించి ఫుల్ క్లారిటీ ఇంకా రావడంలేదు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఇంకో వైపున బాలకృష్ణ, తన తండ్రి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తూ, ఎన్టీఆర్‌కి భారతరత్న వచ్చేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ జీవితంలో ఎవరికీ తెలియని చాలా కోణాలున్నాయనీ, అవన్నీ తెలుగు ప్రజలు తెలుసుకోవాల్సి ఉందనీ, ఈ సినిమాని ఎంతో పరిశోధించి తెరకెక్కిస్తున్నామని చెప్పారు.