50 కోట్ల సినిమా అని అందరూ తొలుత అనుకున్నారు కానీ, అదిప్పుడు 100 కోట్ల సినిమాగా అవతరించేలా వుంది. 'ఎన్‌టిఆర్ బయోపిక్' ప్రీ రిలీజ్ బిజినెస్ 100 కోట్లను టచ్ చేస్తుందేమోనని తెలుగు సినీ ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. స్వర్గీయ నందమూరి తారకరామారావు పేరు చెబితే తెలుగు జాతి పులకించిపోతుంది. సినీ, రాజకీయ రంగాలపై ఆయన వేసిన ముద్ర అలాంటిది. ఆయన చనిపోయి ఎన్నో ఏళ్ళు అయిపోయింది..
కానీ, ఇప్పటికీ ఎన్‌టిఆర్ పేరు చెబితే వైబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి.. తెలుగు రాజకీయాలు ప్రభావితమవుతాయి. అదీ ఎన్టీఆర్ అంటే. అలాంటి ఎన్టీఆర్ జీవిత చరిత్ర అంటే ఆ మాత్రం 'కిక్' వుంటుంది, వుండి తీరుతుంది. నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి రాణా, విద్యాబాలన్, ప్రకాష్‌రాజ్, రకుల్ ప్రీత్ సింగ్, కళ్యాణ్‌రామ్.. ఇలా చెప్పుకుంటూ పోతే, 'ఎన్‌టిఆర్ బయోపిక్' నటీనటుల లిస్ట్ చాలా చాలా పెద్దది. లిస్ట్‌లో ఇంకా చాలామంది నటీనటులు చేరబోతున్నారన్న ప్రచారం ఒకింత ఆశ్చర్యం కలిగించకమానదు. జనవరిలో సినిమా రిలీజ్ చేయనున్నారు.
మరి, కొత్తగా నటీనటుల ఎంపిక జరుగుతుండడమేంటి.? 'క్రిష్' తలచుకుంటే ఏదైనా చేసెయ్యగలడు. తక్కువ టైమ్‌లో భారీ సినిమా తీయడమెలాగో బాలకృష్ణ హీరోగానే ట్రై చేసి, 'గౌతమి పుత్ర శాతకర్ణి'గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. నటీనటుల ఎంపిక మాత్రమే కాదు, ఆ ఎంపిక ఆయా పాత్రలకు అచ్చంగా సరిపోయేలా వుండడం గొప్ప విషయం. అందుకే 'ఎన్‌టిఆర్ బయోపిక్'పై అంచనాలు అంతకు మించి అనేలా మారిపోతున్నాయి. దటీజ్ 'ఎన్.టి.ఆర్.'.