ద్విపాత్రాభినయాలపై మోజు ఇప్పటిది కాదు. ప్రతీ స్టార్ హీరో కెరీర్‌లోనూ ఈ తరహా సినిమాలు చాలా ఉంటాయి. ఎన్టీఆర్ కూడా ఇది వరకు డ్యూయల్ రోల్స్‌లో చేసినవాడే. `ఆంధ్రావాలా`లో ఎన్టీఆర్ డబుల్ రోల్ చేశాడు. `అదుర్స్`లో ఎన్టీఆర్ రెండు పాత్రల్లో కనిపించాడు. మళ్లీ ఇంతకాలానికి ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు టాక్.
ఎన్టీఆర్ - బుచ్చిబాబు కాంబినేషన్‌లో ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాకి `పెద్ది` అనే టైటిల్ ఖరారు చేశారు. ఇదో స్పోర్ట్స్ డ్రామా. ఇందులో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా నటించబోతున్నట్టు టాక్. తండ్రి పాత్ర లో ఎన్టీఆర్ 60 ఏళ్ల వయసున్నవాడిలా కనిపించబోతున్నాడట.
1970 నేపథ్యంలో సాగే కథ ఇది. ఆ కాలంలో ఓ ఎన్టీఆర్‌ని, ఇప్పుడు ఓ ఎన్టీఆర్‌ని చూపించబోతున్నారని తెలుస్తోంది. మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతోంది. ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో ఓసినిమా రూపుదిద్దుకొంటోంది. ఆ తరవాత ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేస్తాడు ఎన్టీఆర్. ఇవి రెండూ పూర్తయ్యాకే బుచ్చి సినిమా పట్టాలెక్కుతుంది.