నటీనటులు: సమంత అక్కినేని, లక్ష్మి, నాగశౌర్య, రాజేంద్రప్రసాద్ తదితరులు
దర్శకత్వం: బి.వి.నందినీ రెడ్డి.
నిర్మాణ సంస్థలు: సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్
సంగీతం: మిక్కి జె.మేయర్
సినిమాటోగ్రఫర్: రిచర్డ్ ప్రసాద్
విడుదల తేదీ: 5 జులై, 2019
రేటింగ్: 3.25/5
తెలుగులో లేడీ సూపర్‌స్టార్ అనే మాట వినక చాలా రోజులైంది. ఆ మాటని మరోసారి గుర్తు చేస్తోంది సమంత. కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు చేస్తూ సత్తా చాటుతోంది. ఒక సినిమాని భుజాలపై మోసే శక్తి సామర్థ్యాలు తనకి ఉన్నాయని ఆమె తన చిత్రాలతో చాటి చెబుతోంది. పెళ్లి తర్వాత ఆమె బలమైన పాత్రలతో సందడి చేస్తోంది.
అందులో భాగమే `ఓ బేబీ` చిత్రం కూడా! కొరియన్ చిత్రం `మిస్ గ్రానీ` ఆధారంగా బి.వి.నందినిరెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డెబ్బయ్యేళ్ల బామ్మ పాతికేళ్ల పడుచు పిల్లగా మారడమనే ఈ కాన్సెప్టు... ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని పెంచాయి. మరి సినిమా ఎలా ఉంది? సమంత అభినయం ఎలా ఉంది? తదితర విషయాలు తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
* కథ
సావిత్రి అలియాస్ బేబీ (లక్ష్మి)కి చిన్నప్పుడు గాయని కావాలనేది కల. కానీ పెళ్లి కావడంతో ఆ కలలన్నీకల్లలవుతాయి. ఆ తర్వాత జీవితంలో ఎన్నో ఆటుపోట్లు. డెబ్బయ్యేళ్ల వయసులో తన బాల్యమిత్రుడు చంటి (రాజేంద్రప్రసాద్)తో కలిసి క్యాంటీన్ నడుపుతుంటుంది. ఆమె చాదస్తంతో ఇంట్లోవాళ్లు ఇబ్బందిపడుతుంటారు. కోడలు (ప్రగతి) గుండెపోటుకి గురవుతుంది.
అది తన వల్లే అని తెలిశాక... కుటుంబ సభ్యులకి తాను సమస్యగా మారాననని అర్థమయ్యాక ఆమె ఇంటి నుంచి వెళ్లిపోతుంది. అలా వెళ్లిన బేబీ ఉన్నట్టుండి పాతికేళ్ల పడుచు అమ్మాయి స్వాతి (సమంత)గా మారిపోయి తిరిగొస్తుంది. అదెలా సాధ్యమైంది? పడుచు అమ్మాయిగా మారాక ఆమె ఎలాంటి సమస్యల్ని ఎదుర్కుంది? పోగొట్టుకొన్న వయసు తిరిగొచ్చాక ఆమె తన కలల్ని ఎలా సాకారం చేసుకుంది? కుటుంబం కోసం ఏం చేసింది? తదితర విషయాల్ని తెరపై చూడాల్సిందే.
* నటీనటులు
ప్రతి పాత్ర బలంగా ఉంటే... అందుకు తగ్గట్టుగా నటీనటులు కుదిరితే ఆ సినిమా ఎలా ఉంటుందో `ఓ బేబీ`నే ఉదాహరణ. ఇందులో నటులు ఎవ్వరూ కనిపించరు. వాళ్ల పాత్రలే కనిపిస్తాయి. ఎవరిదీ నటన అనిపించదు. అందరూ అంత సహజంగా పాత్రల్లో ఒదిగిపోయారు. ముఖ్యంగా సమంత, లక్ష్మీల నటన చిత్రానికే హైలెట్ అని చెప్పొచ్చు. లక్ష్మిని పోలినట్టుగా సమంత హావభావాలు పలికించిన విధానం మెప్పిస్తుంది. వయసులో ఉన్న సమంత భామ్మలాగా హావభావాలు ప్రదర్శించడం ఆషామాషీ కాదు.
కానీ ఆమె ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది. భావోద్వేగాలు పండించిన విధానం కూడా సమంతలో అత్యుత్తమ నటిని బయపెట్టింది. ఆరంభ సన్నివేశాల్లో లక్ష్మి అభినయం కూడా అంతే. ఆమె సినిమా మొత్తం ఉన్న భావనకి గురిచేస్తుంది. చంటిగా రాజేంద్రప్రసాద్, కొడుకుగా రావు రమేష్ చాల బాగా నటించారు. వాళ్లకి అలవాటైన పాత్రలే అయినా... అందులోనూ కొత్తదనం చూపించే ప్రయత్నం చేశారు.
నాగశౌర్య, ప్రగతి తదితరులు పరిధి మేరకు నటించారు. బాలనటుడు తేజ ఇందులో మనవడిగా ఓ కీలకపాత్రలో కనిపిస్తారు. జగపతిబాబు, అడవిశేష్‌తో పాటు, పతాక సన్నివేశాల్లో ఒక నటుడు చేసే సందడి ఆకట్టుకుంటుంది.
* సాంకేతిక వర్గం
సాంకేతిక విభాగాలు కూడా ఉత్తమంగా పనిచేశాయి. రిచర్డ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫీ ప్రతీ సన్నివేశాన్నీ అందంగా చూపించింది. మిక్కీ జె.మేయర్ సంగీతం ఆకట్టుకుంటుంది. లక్ష్మీభూపాల కలం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన మాటలు హాస్యంతో పాటు, భావోద్వేగాలు పండించాయి. నందినిరెడ్డి దర్శకురాలిగా అత్యుత్తమ పనితీరును కనబరిచారు. కథ నుంచే వినోదాన్ని పండించిన విధానం బాగుంది. నేటివిటీ విషయంలో ఆమె తీసుకున్న శ్రద్ధ, సందేశాన్ని చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
సినిమాలో బేబీ కోడలు వండే చేపల కూరలాగా... మనం చేసే రీమేక్ చిత్రాల్లో అడుగడుగునా మాతృక వాసనలే. ఆ కథ మనది కాదు, ఆ వాతావరణం మనది కాదనిపిస్తుంటుంది. కానీ `ఓ బేబీ` మాత్రం అచ్చమైన తెలుగు సినిమా అనే అనుభూతికి గురిచేస్తుంది. ఆద్యంతం నవ్విస్తూ, అక్కడక్కడా కంటతడిపెట్టిస్తూ ఒక మంచి సినిమా చూశామనే అనుభూతికి గురిచేస్తుందీ చిత్రం.
* విశ్లేషణ
సరైన విజయం కోసం ఎదురు చూస్తున్న నందినిరెడ్డి ఈసారి కొరియన్ చిత్రం `మిస్ గ్రానీ` ఎంచుకుంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచులకి అనుగుణంగా తీర్చిదిద్దింది. ఆసక్తి రేకెత్తించే కాన్సెప్టు ఇది. మంచి డ్రామా, మానవీయ విలువలు, వినోదం, భావోద్వేగాలతో కూడిన కథ. అయితే ఇలాంటి కథల్ని నేటివిటీకి అనుగుణంగా తీర్చిదిద్దడం ఓ పెద్ద ఛాలెంజ్. ఆ ఛాలెంజ్‌ని సమర్థవంతంగా ఎదుర్కుంది నందినిరెడ్డి. అచ్చమైన తెలుగు కథలాగా మలిచింది. అందుకోసం ఆరంభంలో కొన్ని సన్నివేశాల్ని వాడుకుంది.
మనదైన నేటివిటీని తెరపై చూపిస్తూ ప్రేక్షకుల్ని కథలోకి తీసుకెళ్లింది నందినిరెడ్డి. సమంత ఎంట్రీ నుంచే అసలు కథ మొదలవుతుంది. అప్పటివరకు అత్తాకోడళ్ల మెలోడ్రామని తలపిస్తుంది సినిమా. ఎప్పుడైతే బామ్మ కాస్త భామగా మారిపోయిందో అప్పట్నుంచో వినోదం పండుతుంది. కొన్ని సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. డెబ్బయ్యేళ్ల వయసున్నభామ కుర్రకారుతో కలిసిపోవల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఆకారానికి భామగా కనిపించినా... ఆమె అలవాట్లు ఆలోచనలు బామ్మనే గుర్తు చేస్తే ఆ వాతావరణం ఎలా మారిపోతుంది? అనే విషయాల నుంచే వినోదం పండించింది దర్శకురాలు. ప్రథమార్థం అంతా సరదా సరదాగా సాగుతుంది.
ద్వితీయార్థంలో అసలు కథంతా ఉంటుంది. చెప్పాల్సిందంతా ద్వితీయార్థంలోనే కావడంతో భావోద్వేగాల మోతాదు ఎక్కువైంది. సినిమా సుదీర్థంగా సాగుతున్న అనుభూతి కలుగుతుంది. ఊహించని మలుపులు, కథనంలో కొత్తదనం లేకపోవడంతో అక్కడక్కడ సన్నివేశాలు బోర్ కొట్టించినా... సందేశం, భావోద్వేగాలు కట్టిపడేస్తాయి. ఒక మంచి సినిమాని చూసిన అనుభూతికి గురిచేస్తుంది.
* ప్లస్ పాయింట్స్
+సమంత నటన
+కథ
+ప్రథమార్థం వినోదం, సందేశం
+నటీనటులు
* మైనస్ పాయింట్స్
-భావోద్వేగాల మోతాదు ఎక్కువకావడం
-ద్వితీయార్థం సుదీర్ఘంగా సాగడం
* ఫైనల్ వర్డిక్ట్: వాహ్ బేబీ
- రివ్యూ రాసింది శ్రీ.