తెలుగు నాట దసరా రిలీజ్‌లు లేనట్లే.. అయితే, ఇది సినిమా హాళ్ళకే పరిమితం. నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాళ్ళు తెరుచుకోవాల్సి వుండగా, ‘మేం ఇప్పుడున్న పరిస్థితుల్లో హాళ్ళు తెరవలేం.. సినిమాల్ని ప్రదర్శించలేం..’ అంటూ సినిమా హాళ్ళ యాజమాన్యాలు తేల్చి చెప్పేశాయి. దాంతో, దసరా సీజన్‌ని తెలుగు సినీ పరిశ్రమ మిస్ అవక తప్పదు. ఒకవేళ సినిమా హాళ్ళు తెరచుకున్నా, 50 శాతం కెపాసిటీతో వాటిని నడపడం తలకు మించిన భారమే. అది నిర్మాతకి కూడా నష్టమే. దీపావళికి కూడా సినిమా హాళ్ళు తెరుచుకుంటాయో లేదో తెలియని పరిస్థితి.
ప్రస్తుతం వున్న అంచనాల్ని బట్టి, సంక్రాంతికి కూడా పరిస్థితి అనుకూలంగా మారుతుందన్న నమ్మకం సినీ ప్రముఖుల్లో కనిపించడంలేదు. ఇదిలా వుంటే, ఓటీటీ మాత్రం కళకళ్ళాడుతోంది. హిట్టు కొట్టే సినిమాలు రాకపోయినా, ఓటీటీకి క్రేజ్ అమాంతం పెరిగిపోతోంది. ఒకటికి పదిసార్లు సినిమాని ఇంట్లోనే చూసుకునే అవకాశం అతి పెద్ద ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. క్రమంగా ప్రేక్షకులు, ఇంట్లోనే సినిమా చూడటానికి అలవాటుపడిపోతే, మళ్ళీ వాళ్ళు సినిమా హాళ్ళకు వెళ్ళడం అనేది అంత తేలికైన వ్యవహారం కాదు.
తాజా అంచనాల ప్రకారం చూసుకుంటే, ఓటీటీకి తిరుగులేదనే అనిపిస్తోంది. కానీ, ఇది సినిమా హాళ్ళు తెరచుకునేంతవరకేనని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. వేలాదిమందికి ఉపాధి కల్పించే సినిమా హాళ్ళు ఎప్పుడు తెరచుకుంటాయో ఏమో!