దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'పద్మావతి' సినిమా ఇటీవల ఎన్ని వివాదాలను ఎదుర్కుందో అందరికీ తెలిసిందే. వివాదాలు అంటే అలాంటి ఇలాంటి వివాదాలు కావు. ఏకంగా ఈ సినిమాలో నటించినందుకు దీపికా ముక్కు చెవులూ కోసేస్తామని కొంతమంది అంటే, ఏకంగా తల నరికి తెస్తే కోట్లు కుమ్మరిస్తామంటూ ప్రచారాలు జరిగాయి. డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీపై కూడా ఇదే రకమైన ఆరోపణలు, చిన్నా చితకా దాడుల వరకూ చేరింది పరిస్థితి.
మొత్తానికి సినిమా విడుదల నిలిపివేయడమైంది. డిశంబర్ 1న విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పటికీ విడుదల కాలేదు. అసలు సెన్సార్‌కి కూడా వెళ్లకుండా ఇంత రాద్ధాంతం జరిగింది ఈ సినిమాపై. ఇదంతా గడిచిపోయిన కథ. ప్రస్తుతం ఈ సినిమా సెన్సార్‌కి వెళ్లింది. ప్రత్యేక సమీక్షా కమిటీ ఆధ్వర్యంలో సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకి 26 కట్స్‌తో సర్టిఫికెట్ ఇచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాకి సెన్సార్ బోర్ట్ యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. అయితే కండిషన్స్ అప్లై. అవేంటంటారా?
ఇంతవరకూ ఈ సినిమాని చిత్తోర్ ఘడ్ రాణీ పద్మావతి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కిన సినిమా 'పద్మావతి' అని ప్రచారం జరిగింది. కానీ సెన్సార్ రిపోర్ట్ తర్వాత ఈ సినిమాకి కొన్ని కండిషన్స్ పెట్టారు. ఈ సినిమా యదార్ధ చారిత్రక గాధ కాదు, కేవలం కల్పితం మాత్రమే అని సినిమా స్టార్టింగ్‌కి ముందు చిత్ర యూనిట్ ప్రకటించాలనీ ప్రకటించింది. అలాగే రాజ్‌పుత్‌ల సాంప్రదాయ నృత్యంతో తెరకెక్కించిన 'ఘూమర్.. ఘూమర్' సాంగ్‌లో కూడా కొన్ని మార్పులు సూచించింది.
అన్నింటికన్నా ముఖ్యంగా సినిమా టైటిల్ మారిపోయింది. 'పద్మావతి' కాదు ఈ సినిమా టైటిల్ 'పద్మావత్' అని మార్చి సినిమా విడుదల చేయాలనీ సెన్సార్ బోర్డ్ ఆదేశించింది. ఈ మార్పులతో కూడిన 'పద్మావత్' చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందన్న మాట. బహుశా జనవరి 26కే ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయనీ బాలీవుడ్ వర్గాల సమాచారమ్.