పవన్ కళ్యాణ్‌తో సినిమా రూపొందించాలని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయత్నాలే కాదు, దాదాపు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చేసినట్లే. కానీ, పవన్ కళ్యాణ్ నుండి మాత్రం పోజిటివ్ సంకేతాలు రావడం లేదు. తాజాగా లాంగ్ మార్చ్‌లో భాగంగా పవన్ కళ్యాణ్ తన రీ ఎంట్రీ గురించి షాకింగ్ మాటలు చెప్పారు. నిర్మాణం అయితే, చేస్తా కానీ, నటన గురించి ఇప్పుడప్పుడే చెప్పలేనని తేల్చేశారు. మరి బోనీ కపూర్ పరిస్థితేంటీ.?
చాలా కాలంగా 'పింక్' రీమేక్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందనుందన్న ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలో బోనీ కపూర్ ఆ ప్రాజెక్ట్ ఆఫర్‌ని పవన్ కళ్యాణ్ వద్దకు తీసుకొచ్చారు. కానీ, పవన్ రెస్పాన్స్ పై విధంగా ఉండడంతో, బోనీ కపూర్ సందిగ్ధంలో పడ్డారు. ఓ పక్క అభిమానులు, ఇంకో పక్క కుటుంబ సభ్యులు, మరో పక్క సన్నిహితులు ఇలా అందరూ పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. అన్నయ్య చిరంజీవి అయితే, ఇటు రాజకీయాలు, అటు సినిమాలు కూడా మ్యానేజ్ చేయగల సత్తా తమ్ముడికి ఉందంటూ పదే పదే చెబుతున్నారు. కానీ, పవన్ మాత్రం నా జీవితం రాజకీయాలకే అంకితం. ప్రజలకే అంకితం.. అంటూ ప్రజలతో మమేకమవుతున్నారు.
మరి ఈ తరుణంలో ఏరి కోరి వచ్చిన బోనీ కపూర్ ఏం చేస్తాడో చూడాలిక. ఇదిలా ఉంటే, బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన 'పింక్' చిత్రం అజిత్ హీరోగా తమిళంలో రీమేక్ అయ్యి అక్కడ కూడా మంచి విజయం సాధించింది. ఇక తెలుగులో మాత్రం పవన్ కోసమే ఈ ప్రాజెక్ట్ ఎదురు చూస్తున్నట్లుంది.