ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఏప్రిల్ లో జరగనున్న నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజంట్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఈ కారణంతో సినిమాలను పక్కన పెట్టారు. ముందు పాలిటిక్స్ కి, సినిమాలకి సమానంగా టైం కేటాయించి, ఎన్నికల ముందే తన ప్రాజెక్ట్స్ పూర్తి చేయాలని అనుకున్నారు కానీ, అనూహ్య రాజకీయ పరిణామాల వల్ల సినిమాలకి టైం కేటాయించలేకపోయారు. పవన్ కళ్యాణ్ వి మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. వాటిలో "ఉస్తాద్ భగత్ సింగ్", "ఓజి" “హరిహర వీరమల్లు”. పవన్ బిజీగా ఉండటం వలన హరీష్ శంకర్ రవితేజతో మిస్టర్ బచ్చన్ మొదలు పెట్టె పనిలో ఉన్నాడు. ఎలక్షన్స్ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేస్తామని క్లారిటీ ఇచ్చాడు. సుజీత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న 'ఓజి' కూడా 80 శాతం షూటింగ్ పూర్తయిందని సెప్టెంబర్ 27 కి రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసారు.
క్రిష్ తెరకెక్కిస్తున్న హరిహరవీరమల్లు గూర్చి ఎలాంటి అప్డేట్ లేదని, ఫాన్స్ నిరాశగా ఉన్న టైంలో మంచి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. పవన్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటిదాకా రిలీజ్ కి నోచుకోలేదు. కనీసం షూటింగ్ ఎంతవరకు పూర్తయిందన్న విషయంపై కూడా స్పష్టత లేదు. ఒకానొకసమయంలో ప్రాజెక్టు ఆగిపోయిందని నిర్మాత ఏఎం రత్నంకు పవన్ రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేస్తున్నట్టు ప్రచారాలు కూడా జరిగాయి. పవన్ కూడా 'OG ' ఉస్తాద్ 'భగత్ సింగ్' ల పైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు, ఆ మూవీస్ కి కేటాయించిన టైం హరి హర వీరమల్లుకి ఇవ్వలేదని వార్తలు వచ్చాయి. ఇలాంటి టైంలో మేకర్స్ నుంచి స్పష్టమైన అప్డేట్ వచ్చింది.
ఈ సినిమా చిత్ర నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. హరిహర వీరమల్లు ఆగిపోలేదని, ప్రస్తుతం ఈ పాన్ ఇండియా మూవీకి సంబంధించిన విఎఫ్ఎక్స్ పనులు ఇరాన్, కెనడా, బెంగళూరు, హైదరాబాద్ ఇంకా చెన్నై ప్రాంతాల్లో ఆడియన్స్ ఊహించని రేంజ్ లో మంచి విజువల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నామని, ఆ థ్రిల్ ని త్వరలోనే టీజర్ రూపంలో ఆస్వాదించడానికి రెడీ కమ్మని చెబుతూ ట్వీట్ చేశారు. సినిమా షూటింగ్ ఇంకా 30 శాతం వరకు పెండింగ్ లో ఉందని సమాచారం. 2025 నాటికి హరిహర వీరమల్లు రావటం కన్ఫర్మ్ అని ఫాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.