పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించాల్సిన ఎస్ఆర్‌టీ ఎంటర్టైన్మెంట్స్ చిత్రం ఇక అఫిషియల్‌గా రద్దయింది. ఈ సినిమా గురించి కొన్నేళ్లుగా వార్తలు వినిపించినా, ఎటువంటి ప్రోగ్రెస్ లేకపోవడంతో ఎట్టకేలకు నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని ప్రకటించింది.
ఇది ప్యాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కే భారీ ప్రాజెక్ట్‌గా ప్రకటించారు. ప్రి-లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. అయితే, పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఆయన Hari Hara Veera Mallu, OG, Ustaad Bhagat Singh వంటి మూడు పెద్ద సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇవే పూర్తి కావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో, ఈ కొత్త సినిమా క్యాన్సిల్ చేయక తప్పలేదు.
నిర్మాత రామ్ తాళ్ళూరి ఈ ప్రాజెక్ట్‌పై ఆశలు వదిలేసినట్లు గతంలోనే కొన్ని హింట్స్ ఇచ్చారు. 'మెకానిక్ రాకీ' సినిమా రిలీజ్ టైమ్‌లోనే పవన్ మూవీపై పెద్దగా అంచనాలు పెట్టుకోవద్దని పేర్కొన్నారు. మరోవైపు, దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా ఈ సినిమా గురించి ఎక్కడా ప్రస్తావించకుండా కొత్త ప్రాజెక్టులపై దృష్టిపెట్టడం గమనార్హం.
అసలు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ కూడా నెమ్మదిగా సాగుతుండటం, పూర్తవుతుందా? లేదా? అనే అనుమానాలు అభిమానుల్లో నెలకొన్నాయి. రాజకీయాలకు పూర్తి ప్రాధాన్యత ఇస్తున్న పవన్, తన సినిమా కమిట్‌మెంట్స్‌ను ఎంతవరకు పూర్తి చేస్తాడో వేచి చూడాలి!