పవన్ కల్యాణ్ ఏ మూడ్‌లో ఉన్నాడో ఏమో... వరుసగా కొత్త సినిమాల్ని ఒప్పేసుకుంటున్నాడు. వకీల్ సాబ్ అవ్వగానే క్రిష్ తో సినిమా చేయాలి. సాగర్ చంద్ర, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి లైన్ లో ఉన్నారు. ఇప్పుడు జానీ మాస్టర్ కథకీ ఓకే చెప్పేసినట్టు టాక్. కొరియోగ్రాఫర్ గా తనదైన ముద్ర వేశాడు జానీ మాస్టర్. టాప్ హీరోలందరి సినిమాలకూ పని చేశాడు. దర్శకుడు కావాలని ఎప్పటి నుంచో ఆశ. అందుకే కొన్ని కథలు సైతం సిద్ధం చేసుకున్నాడు. అందులో ఓ కథని.. పవన్‌కి చెప్పి ఒప్పించాడన్న టాక్ వినిపిస్తోంది.
అయితే ఈసినిమా సెట్ అవ్వడం వెనుక రామ్ చరణ్ కృషి చాలానే వుందట. జానీకి తొలి రోజుల్లో అవకాశాలిచ్చిందీ, వెన్నుదన్నుగా నిలిచింది చరణే. ఇప్పుడు దర్శకుడిగా మారడానికి సైతం.. తనే కారణమట. పవన్ - జానీలను కలిపింది చరణే అని, ఈ సినిమాకి నిర్మాతగా సైతం చరణ్ వ్యవహరించబోతున్నాడని టాక్. బాబాయ్‌తో ఓ సినిమా చేయాలని చరణ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ ప్రాజెక్టుని ఇలా వర్కవుట్ చేయాలనుకుంటున్నాడు. 2022లో ఈ సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయని సమాచారం అందుతోంది.