ఈరోజుల్లో సినిమా అంటే భారీ హంగులు, ఆర్భాటాలూ తప్పనిసరి అయిపోయాయి. పైగా స్టార్ హీరో సినిమా అంటే ఇవి ఉండాల్సిందే అని ఫిక్సయిపోతున్నారు. కథానాయికల్ని,సాంకేతిక నిపుణుల్నీ బాలీవుడ్ నుంచి దిగుమతి చేయడం పరిపాటి అయిపోయింది. పవన్ కల్యాణ్ సినిమాకీ ఇదే జరుగుతోంది. పవన్ కల్యాణ్ - క్రిష్ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఏ.ఎం.రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కథ సిద్ధం అవుతోంది. 2020 ప్రధమార్థంలో ఈ చిత్రం పట్టాలెక్కబోతోంది.
ఈ సినిమా కోసం బాలీవుడ్ నుంచి కథానాయికని దిగుమతి చేయాలని క్రిష్ భావిస్తున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా చురుగ్గా సాగుతున్నాయని తెలుస్తోంది. బాలీవుడ్‌లో పేరున్న నాయికే ఈ సినిమాలో పవన్ పక్కన నటిస్తారని టాక్. కొంతమంది సాంకేతిక నిపుణుల్నీ అక్కడి నుంచే తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు.