పవన్ ట్రెండ్ ఫాలో అవ్వడు.. సెట్ చేస్తాడు. అది తెరపైనైనా, జీవితంలోనైనా. ఇది మరోసారి నిజం అయ్యింది. పవన్ పుట్టిన రోజు సంబరాలు అంబరాన్ని తాకేలా చేసుకున్నారు అభిమానులు. పవన్ కోసం ఫ్లెక్సీలు కట్టారు. కేక్‌లు కట్ చేశారు. పాలాభిషేకాలు చేశారు. అన్నదానాలు సరేసరి. ప్రభుత్వాసుపత్రులకు ఆక్సిజన్ సిలండర్లు దానం చేసి - తమ మంచి మనసు చాటుకున్నారు. ఇక ట్విట్టర్ లో సెలబ్రెటీలైతే - హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్ అంటూ ట్వీట్ల మీద ట్వీట్లు చేశారు. ఇవన్నీ ఒక ఎత్తయితే, తనకు ట్వీట్ చేసిన వాళ్లకు, శుభాకాంక్షలు తెలిపిన వాళ్లకు.. ప్రతిగా శుభాకాంక్షలు తెలుపడం మొదలెట్టాడు. ప్రతి ఒక్కరికీ ట్విట్టర్ లో ప్రత్యేకంగా.. బదులు ఇవ్వడం ప్రారంభించాడు. పవన్ కి ట్వీట్ చేసిన ప్రతీ ఒక్కరికీ వ్యక్తిగతంగా పవనే ట్వీట్ చేయడం.. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
ఒకరా.. ఇద్దరా? వందలమందికి పవన్ సమాధానాలు ఇస్తున్నారు. ప్రతి ఒక్కరినీ పేరు పేరున పలకరిస్తున్నాడు. థ్యాంక్స్ చెబుతున్నాడు. యువ హీరోల్ని సైతం.. `సార్` అంటూ సంబోధించడం `మీ రాబోయే సినిమాలు బాగా ఆడాలని` కోరుకోవడం చూస్తుంటే ముచ్చటేస్తోంది అందరికీ. స్వప్న అనే దివ్యాంగురాలు గీసిన బొమ్మ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అది చూసి పవన్ చలించిపోయారు. `మా బంగారు తల్లీ..` అంటూ స్వప్నని సంబోధించి - `వైజాగ్ వచ్చినప్పుడు నిన్ను తప్పకుండా కలుస్తాను` అని ట్వీట్ చేశాడు పవన్. పవన్ పుట్టిన రోజు కంటే - ఇలా రిప్లైలు ఇచ్చుకుంటూ వెళ్లడమే మరో పెద్ద పండగలా మరిందిప్పుడు. పవన్‌కి ఇంత ఓపిక. ఇంత సహనం, ఇంత సంస్కారమా.? అంటూ యాంటీ ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. అదీ పవన్ అంటే.