పవన్ కల్యాణ్ - హరీష్ శంకర్ ల కాంబినేషన్ `గబ్బర్ సింగ్` తో ఇది వరకే ఓ మ్యాజిక్ చేసేసింది. అది పవన్ అభిమానులకు విపరీతంగా నచ్చిన సినిమా. పవన్‌కి హరీష్ భక్తుడు కాబట్టి, పవన్ ఫ్యాన్స్ మెచ్చేలా వాళ్లందరికీ నచ్చేలా పవన్ ని చూపించగలిగాడు. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబో సెట్టయ్యింది. మైత్రీ మూవీస్ లో పవన్ కథానాయకుడిగా తెరకెక్కే చిత్రానికి హరీష్ దర్శకుడు. ఇప్పటికే హరీష్ శంకర్ స్క్రిప్టు పనుల్లో దిగిపోయాడు. అది ఓ కొలిక్కి వచ్చేసిందట కూడా.
మరి ఈసినిమాలో పవన్ పాత్రేమిటి అన్న విషయంలో ఆసక్తి కరమైన చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో పవన్ పోలీస్ గా కనిపిస్తాడని కొందరంటుంటే.. కాదు పవన్ లెక్చలర్ పాత్రలో కనిపించి పాఠాలు చెబుతాడని మరికొందరంటున్నారు. పవన్ పాత్ర రెండు షేడ్స్‌లో ఉంటుందని - పోలీస్, మాస్టారు... ఇలా రెండు పాత్రల్లోనూ కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. హరీష్ శంకర్ తీసిన `మిరపకాయ్` సినిమాలో రవితేజ పాత్ర కూడా ఇలానే ఉంటుంది. ఇప్పుడు మిరపకాయ్ స్టైల్ లోనే ఈ సినిమా తీస్తే - పవన్ ని రెండు పాత్రల్లోనూ చూసేయొచ్చు. మరి హరీష్ మనసులో ఏముందో?