అటు సినిమాలు, ఇటు రాజకీయాలు అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్న పవన్ కల్యాణ్..రెండింటికీ సమానమైన ప్రాధాన్యమే ఇస్తున్నాడు. ఆమధ్య సుజిత్ సినిమాని లాంఛనంగా మొదలెట్టిన పవన్, ఇప్పుడు... సముద్రఖని సినిమాకీ క్లాప్ కొట్టేశాడు. తమిళంలో ఘన విజయం సాధించిన వినోదయ సీతం సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కీలక పాత్రధారులు. సముద్రఖని దర్శకుడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ఈరోజు క్లాప్ కొట్టారు. రెగ్యులర్ షూటింగ్ కూడా ఈరోజు నుంచే మొదలైంది. త్రివిక్రమ్ ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. నిజానికి ఈ చిత్రానికి బుర్రా సాయి మాధవ్ సంభాషణలు అందించాల్సివుంది. కానీ... ఆయన చివరి నిమిషంలో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకొన్నట్టు టాక్. దాంతో ఆ బాధ్యతలు కూడా త్రివిక్రమ్ పైనే పడ్డాయి. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందింనున్నాడు. ఈ సినిమాకి పవన్ ఇచ్చిన కాల్షీట్లు 30 మాత్రమే. ఈలోగానే పవన్‌పై తీయాల్సిన సన్నివేశాల్ని చిత్రీకరస్తారు. జూన్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.