రజనీకాంత్ నటించిన `అన్నాత్తై` ఈ దీపావళికి విడుదలైన సంగతి తెలిసిందే. శివ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో నయనతార కథానాయికగా నటించింది. తొలి షో పడిన వెంటనే, ఈ సినిమాకి నెగిటీవ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. మరీ బీసీ కాలం నాటి కథని, పాత సినిమాలన్నీ మిక్సీలో వేసినట్టు ఉందని, రజనీ ఈ సినిమా కేవలం డబ్బుల కోసమే చేశాడని విమర్శకులు రెచ్చిపోయారు. ఈ సినిమాతో రజనీ పనైపోయిందన్న వ్యాఖ్యలూ వినిపించాయి. ఇంకొంతమంది ఓ అడుగు ముందుకేసి, రజనీ ఇక సినిమాలకుగుడ్ బై చెప్పాల్సిన సమయం వచ్చిందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
తెలుగులో అయితే ఈసినిమా డిజాస్టర్. అయితే తమిళంలో మాత్రం రజనీ తన మానియా చూపించాడు. ఇప్పటి వరకూ ఈసినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్లు వచ్చాయని తమిళ ట్రేడ్ వర్గాలు లెక్క గట్టాయి. ఒక్క తమిళనాటే దాదాపుగా 130 కోట్లు వచ్చాయట. ఇది రజనీ స్టామినాకు నిదర్శనం అని అక్కడి బాక్సాఫీసు వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చినా, ఈస్థాయిలో వసూళ్లు రాబట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇదంతా రజనీ ఫ్యాన్స్ మాయాజాలం అని కొందరు అంటుంటే, ఈ లెక్కలన్నీ తప్పుల తడక అని, థియేటర్లలో జనం లేనప్పుడు 200 కోట్లు ఎలా వస్తాయని, అంకెలతో రజనీ ఫ్యాన్స్ గారడీ చేస్తున్నారని నాన్ రజనీ ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. అక్కడ విజయ్ ఫ్యాన్స్ కీ, రజనీ ఫ్యాన్స్ కీ అస్సలు పడదు. రజనీ ఫ్యాన్స్ తమ హీరో సినిమా 200 కోట్లు సాధించిందని గొప్పలు చెప్పుకుంటుంటే, ఇదంతా ఫేక్ గోలంటూ.. విజయ్ ఫ్యాన్స్ వాళ్ల గాలి తీసేస్తున్నారు.