పేక మేడ‌లు మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

చిత్రం: పేక మేడ‌లు
దర్శకత్వం: నీలగిరి మామిళ్ల


నటీనటులు: వినోద్ కిషన్, అనూష కృష్ణ, రితిక శ్రీనివాస్, జగన్ యోగి రాజ్, అనూష నూతల, గణేష్ తిప్పరాజు, నరేన్ యాదవ్


నిర్మాత: రాకేష్ వర్రే


ఎడిటర్ : సృజన అడుసుమిల్లి, హంజా అలీ
సినిమాటోగ్రాఫర్ : హరిచరణ్ కె.
మ్యూజిక్ : స్మరణ్ సాయి


బ్యానర్స్: క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ: 19 జూలై 2024


ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 3.25/5

 

ప్రేక్ష‌కుల్ని ఆక‌ర్షించ‌డం చిన్న సినిమాల ముందున్న పెద్ద టాస్క్‌. ఈ రోజుల్లో స్టార్ హీరోల సినిమాల‌కే జ‌నం రావ‌ట్లేదు. కొత్త వాళ్ల‌తో చేసిన చిన్న సినిమా అంటే - ఇక చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. కంటెంట్ ఉన్నా స‌రే, ప్రేక్ష‌కుల్ని థియేట‌ర్ల వ‌ర‌కూ ర‌ప్పించాలి. అస‌లు ఇలాంటి సినిమా ఒక‌టి వ‌స్తుంద‌న్న విష‌యం ప్రేక్ష‌కుల‌కు తెలిసేలా చేయాలి. ఈ విష‌యంలో 'పేక మేడ‌లు' టీమ్ స‌క్సెస్ అయ్యింది. ఇందులో స్టార్లెవ‌రూ లేరు. దాదాపుగా అంతా కొత్త‌వారే. అయినా స‌రే, ఈ సినిమా గురించి జ‌నం మాట్లాడుకొన్నారు. దానికి గ‌ల కార‌ణం.. ప్ర‌మోష‌న్‌. రూ.50ల‌కే ప్రీమియ‌ర్ షోలు ప్ర‌ద‌ర్శించ‌డం సినిమాకు మంచి బ‌జ్ తీసుకొచ్చింది. టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా సాగాయి. అందుకే 'పేక మేడ‌లు' విడుదల‌కు ముందే జ‌నంలోకి వెళ్లింది. ఇప్పుడు ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది?  ప్ర‌చారంలో క‌నిపించిన ఆర్భాటం క‌థ‌లోనూ ఉందా?  'పేక మేడ‌లు' ఎవ‌రు చూడాల్సిన సినిమా?


క‌థ‌:

ల‌క్ష్మ‌ణ్ (వినోద్ కిష‌న్‌) బీటెక్ చ‌దివినా, స‌రైన ఉద్యోగం రాక‌ రియ‌ల్ ఎస్టేట్ ఏజెంట్ గా ప‌ని చేస్తుంటాడు. ఉండేది బ‌స్తీలో. కానీ క‌ల‌లు బంజారా హిల్స్ రేంజ్‌లో ఉంటాయి. ఎలాగైనా డ‌బ్బులు సంపాదించాల‌ని, లైఫ్‌ని రిచ్‌గా గ‌డ‌పాల‌ని గాల్లో మేడ‌లు క‌డుతుంటాడు. కానీ... ఇంట్లో పెళ్లాం దాచుకొన్న డ‌బ్బుల్ని సైతం ఎత్తుకెళ్లి తాగి తంద‌నాలు ఆడ‌తాడు. భార్య (అనూష కృష్ణ‌) త‌న కాళ్ల‌పై తాను నిల‌బ‌డే ర‌కం. ఇంట్లోనే పిండి వంట‌లు త‌యారు చేస్తూ నాలుగు డ‌బ్బులు వెన‌కేసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటుంది. కొడుకుని కాన్వెంట్ లో చ‌దివించాల‌ని, బ‌స్తీకి మారాల‌ని ప్ర‌య‌త్నిస్తుంటుంది. ల‌క్ష్మ‌ణ్‌కు శ్వేత (రితిక శ్రీ‌నివాస్‌) అనే ఎన్‌.ఆర్‌.ఐ ప‌రిచ‌యం అవుతుంది. త‌న‌ని ట్రాప్ చేసి ద‌గ్గ‌ర అవుతాడు. శ్వేత మాయ‌లో ప‌డి ఇంటినీ, ఇల్లాలినీ పూర్తిగా నిర్ల‌క్ష్యం చేస్తాడు. ఆ త‌ర‌వాత ఏమైంది? భార్య‌కు ఈ విష‌యం తెలిసిందా?  తెలిస్తే ఎలా రియాక్ట్ అయ్యింది?  శ్వేత‌తో న‌డిపిన డ్రామా ఎంత వ‌ర‌కూ సాగింది? ఈ ప్ర‌యాణంలో ల‌క్ష్మ‌ణ్ తెలుసుకొన్న‌దేమిటి?  చివ‌రికి అత‌ని క‌థ ఎలా ముగిసింది? ఇవ‌న్నీ తెర‌పై చూడాలి.


విశ్లేష‌ణ‌:

కొన్ని క‌థ‌లు స‌మాజంలోంచి పుడుతుంటాయి. కొన్ని పాత్ర‌లు మ‌న‌మ‌ధ్యే తిరుగుతుంటాయి. అలాంటి క‌థ‌, ఆ త‌ర‌హా పాత్ర‌లు `పేక మేడ‌లు`లో క‌నిపిస్తాయి. మ‌న మ‌ధ్య చాలామంది లక్ష్మ‌ణ్‌లు ఉంటారు. ఆస్తి మూరెడు - ఆశ బారెడు టైపు. ఉన్న‌దాంట్లో సంతృప్తి ప‌డ‌కుండా, గాల్లో మేడ‌లు క‌ట్టాల‌నుకొంటే ఆ జీవితాలు ఎలా కుప్ప‌కూలిపోతాయో ఈ క‌థ‌లో చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. టేకాఫ్ స్లోగా ఉంటుంది. ల‌క్ష్మ‌ణ్ పాత్ర‌ని ప‌రిచ‌యం చేయ‌డానికి ద‌ర్శ‌కుడు కొంత స‌మ‌యం తీసుకొన్నాడు. ఆ త‌ర‌వాత ప్రేక్ష‌కులు ఆ పాత్ర‌తో ప్రయాణం చేస్తారు. శ్వేత పాత్ర రాక‌తో క‌థ‌లో వేగం వ‌స్తుంది. 


శ్వేత‌ని ట్రాప్ చేయ‌డానికి ల‌క్ష్మ‌ణ్ వేసే ఎత్తులు ఫ‌న్నీగా, ఆస‌క్తిగా ఉంటాయి. ద్వితీయార్థంలో ఎక్కువ‌గా ఫ్యామిలీ డ్రామా న‌డిచింది. క‌థానాయిక త‌న కాళ్ల‌పై తాను నిల‌బ‌డ‌డానికి చేసే ప్ర‌య‌త్నాలు, అందులోని ఆటుపోట్లు ఉద్వేగ‌భ‌రితంగా సాగాయి. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణని తెర‌పై అత్యంత స‌హ‌జంగా చూపించాడు ద‌ర్శ‌కుడు. భ‌ర్త‌పై భార్య తిర‌గ‌బ‌డిన సీన్ ఈ చిత్రానికే హైలెట్ గా నిలుస్తుంది. క్లైమాక్స్ కూడా అత్యంత స‌హ‌జంగా ఉంది. 'కొన్ని జీవితాలంతే.. మార‌వు..' అనే అభిప్రాయం క‌లిగించేలా ముగింపు ఇచ్చాడు. తొలి స‌గంలో క‌థంతా అక్క‌డ‌క్క‌డే న‌డుస్తున్న ఫీలింగ్ వ‌స్తుంది. ద్వితీయార్థంలో ఎమోష‌న్స్ ఎక్కువ‌. క‌థానాయిక పాత్ర తీర్చిదిద్దిన విధానం కూడా స్ఫూర్తివంతంగా ఉంటుంది.


న‌టీన‌టులు:

క‌థ‌కు త‌గిన పాత్ర‌లు, పాత్ర‌ల‌కు త‌గిన న‌టీన‌టుల్ని ఎంచుకొన్నందుకు దర్శ‌కుడ్ని అభినందించాలి. వినోద్ కిష‌న్ కొన్ని డ‌బ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌స్థుడే. త‌న‌ని పూర్తి స్థాయి పాత్ర‌లో చూడ‌డం కొత్త‌గా ఉంటుంది. త‌న న‌ట‌న కూడా అత్యంత స‌హ‌జంగా ఉంది. ఆ పాత్ర‌తో ప్ర‌యాణం చేయ‌డానికి కొంత స‌మ‌యం ప‌ట్టినా, ఆ త‌ర‌వాత ల‌క్ష్మ‌ణ్ పాత్ర అల‌వాటైపోయింది. క‌థానాయిక అనూష కృష్ణ‌కు ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. త‌న న‌ట‌న మ‌రింత బాగుంది. ముఖ్యంగా క్లైమాక్స్ లో. డీ గ్లామ‌ర్ పాత్ర‌. కానీ...త‌న న‌ట‌న‌తో అందం తీసుకొచ్చింది. శ్వేత‌గా రితిక చాలా పాష్‌గా క‌నిపించింది. ఎన్‌.ఆర్‌.ఐ పాత్ర‌కు స‌రిగ్గా స‌రిపోతుంది. మిగిలిన న‌టీన‌టులంతా ప‌రిధి మేర చేశారు. ఎవ‌రూ మిస్ మాచ్ అనిపించ‌లేదు.


సాంకేతిక వ‌ర్గం:

చిన్న సినిమా ఇది. బ‌డ్జెట్ ప‌రిమితులు ఉంటాయి. కానీ.. వాటిని ఎక్క‌డా క‌నిపించ‌నివ్వ‌లేదు. స‌హ‌జ‌మైన లొకేష‌న్ల‌లో తెర‌కెక్కించ‌డం వ‌ల్ల 
క్వాలిటీ ప్ర‌శ్న త‌లెత్త‌లేదు. నేప‌థ్య సంగీతం బాగుంది. ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది. ద‌ర్శ‌కుడిలో విష‌యం ఉంది. చాలా స‌న్నివేశాల్ని స‌హ‌జంగా తెర‌కెక్కించ‌గ‌లిగాడు. నిడివి ప‌రంగానూ చిన్న సినిమానే. కాబ‌ట్టి టైమ్ కిల్లింగ్ అనే ప్ర‌శ్నే త‌లెత్త‌దు. మొత్తంగా చెప్పాలంటే నిజాయ‌తీగా చేసిన ప్ర‌య‌త్నాల్లో పేక మేడ‌లు ఒక‌టి.


ప్ల‌స్ పాయింట్స్‌:

న‌టీన‌టులు
ద‌ర్శ‌క‌త్వం
క్లైమాక్స్


మైన‌స్ పాయింట్లు:

స్లో టేకాఫ్‌


ఫైన‌ల్ వ‌ర్డిక్ట్: ఓ మంచి ప్ర‌య‌త్నం..!

ALSO READ : IN ENGLISH


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS