చాలామంది తెలుగు హీరోలు బాలీవుడ్‌లో ప్రయత్నించారు. అలా ప్రయత్నించినవారిలో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ కూడా ఉన్నారు. అయితే వీరెవరూ అక్కడ స్టార్‌డమ్ సంపాదించుకోలేదు. దానిక్కారణం బాలీవుడ్ ఈక్వేషన్స్. అంత తేలిగ్గా సౌత్ హీరోల్ని బాలీవుడ్ భుజానికెత్తేసుకోదు. ఈ తరం యంగ్ హీరోల్లో రాణా చాలా బాలీవుడ్ సినిమాల్లో నటించాడు, నటిస్తూనే ఉన్నాడు. అయితే సోలో హీరోగా రాణాకి అక్కడ ఆశించిన స్థాయిలో అవకాశాలు రావట్లేదు. కారణాలేవైనప్పటికీ సౌత్ హీరోల పట్ల బాలీవుడ్‌లో చిన్న చూపు ఎక్కువనే విమర్శలు అలాగే ఉన్నాయి. అయితే రజనీకాంత్ సినిమాలకి బాలీవుడ్‌లో గిరాకీ చాలా ఎక్కువ. కమల్‌హాసన్ కూడా అంతే. షారుక్‌ఖాన్ తన 'చెన్నయ్ ఎక్స్‌ప్రెస్' సినిమా కోసం రజనీకాంత్ ఇమేజ్‌ని బాగా వాడేసుకున్నాడు. ఆ విషయాలు అలా ఉంచితే, 'బాహుబలి' సినిమా ద్వారా ప్రభాస్ జాతీయ స్థాయి నటుడయ్యాడు. జాతీయ స్థాయిలో ఆయనకు గుర్తింపు వచ్చింది. ఈ ఊపులో ఓ బాలీవుడ్ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు ప్రభాస్. తన మనసులో మాటని కూడా ప్రభాస్ బయటపెట్టాడు. 'బాహుబలి' మేనియాతో ప్రభాస్ తదుపరి సినిమా 'సాహో' కూడా హిందీలోకి డబ్ అవుతుంది. అయితే అది అతన్ని బాలీవుడ్ నటుడిగా మార్చదు. బాలీవుడ్ నుంచి వస్తున్న ఆఫర్స్‌తో స్ట్రెయిట్‌గా అక్కడ సినిమా చేసినప్పుడే బాలీవుడ్ నటుడిగా గుర్తింపు వస్తుందని భావిస్తున్నాడాయన. ఆ ఆఫర్స్‌లో మంచి ఆఫర్స్‌ని ఎంచుకునే పనిలో ఉన్నాడట 'బాహుబలి' ప్రభాస్. బాలీవుడ్‌లో ప్రభాస్ సత్తా చాటాలని ఆశిద్దాం.