కల్కి 2898 ఏడీ మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

చిత్రం: కల్కి 2898 ఏడీ
దర్శకత్వం: నాగ్ అశ్విన్ 


నటీనటులు:  ప్రభాస్, దీపికా పదుకొనే, దిశా పఠాని , అమితాబ్ , కమల్ హాసన్ , విజయ్ దేవరకొండ , మాళవికా నాయర్ తదితరులు 


కథ, స్క్రీన్‌ప్లే : నాగ్ అశ్విన్
నిర్మాత: అశ్వనీదత్ 


సంగీతం: సంతోష్ నారాయనణ్ 
ఛాయాగ్రహణం: జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్
కూర్పు: కోటగిరి వేంకేటేశ్వరరావు 


బ్యానర్స్: వైజయంతీ మూవీస్ ప్రొడక్షన్స్‌
విడుదల తేదీ: 27 జూన్ 2024


ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 3/5


పాన్ వరల్డ్ స్టార్ గా గుర్తింపు పొందిన ప్రభాస్ సినిమా వస్తుంది అంటే, ఇండియాలోనే  కాదు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంటుంది. ప్రభాస్ మార్కెట్ కూడా అదే రేంజ్ లో కొనసాగుతూ ఇండియన్ హీరోల్లో టాప్ లో నిలబెట్టింది. ప్రభాస్ నటించిన బాహుబలి, సాహో, ఆదిపురుష్ , సలార్ ఈ సినిమాలు అన్ని బాక్సాఫీస్ లెక్కల్ని తారుమారు చేసేశాయి. ఓవర్సిస్ లో కూడా ప్రభాస్ రారాజు అనిపించుకున్నాడు. ఇప్పుడు మరోసారి కల్కితో అన్ని రికార్డులు తనపేరు రాసుకున్నాడు. ఆదిపురుష్, సలార్, కల్కి ఇలా వరుస సినిమాలతో అలరిస్తున్నాడు డార్లింగ్. మోస్ట్ వాంటెడ్ మూవీ కల్కి ఈ రోజు థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. మైథాలజీని సైన్స్ ఫిక్షన్‌తో ముడిపెడుతూ నాగ్ అశ్విన్ చేసిన ప్రయత్నం ఫలించిందా లేదా చూద్దాం.


కథ:
కల్కిలో మూడు నాగరాలుంటాయి. ఒకటి 'కాంప్లెక్స్' ఇక్కడ సకల సదుపాయాలు ఉంటాయి.  ఇక్కడే సుప్రీమ్ యాస్కిన్ (కమల్ హాసన్) ఉంటాడు. తన సైన్యంతో ప్రపంచాన్నే శాసిస్తుంటాడు. ప్రపంచం అంతం అయిపోయి చివరినగరంగా నిర్జీవమైన దశలో ఉన్న 'కాశీ' పట్టణాన్ని చూపించారు. మూడో నగరం 'శంబల'. ఇక్కడ అన్నిమతాలకు చెందిన శరణార్థులు నివసిస్తూ ఉంటారు. కల్కి వచ్చి తమని కాపాడతాడని వీళ్లంతా నమ్మకంగా బతుకుతూ ఉంటారు. కథ విషయానికి వస్తే కల్కి రాక కోసం మహాభారతం జరిగిన ద్వాపర యుగం నుంచీ అశ్వత్థామ (అమితాబ్ బచ్చన్) ఎదురుచూస్తూ ఉంటాడు. భైరవ (ప్రభాస్) సకల సదుపాయాలున్న కాంప్లెక్స్ లో ఎలా అయినా సెటిల్ అవ్వాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. అలాంటి టైం లో సుమతి (దీపిక పదుకొణె) కడుపులో కల్కి పుట్టబోతున్నాడని తెలుసుకున్న యాస్కిన్‌ ఆమెను తన దగ్గరికి తీసుకురావాలని సైన్యాన్ని ఆదేశిస్తాడు. భైరవ ఆశ తెలుసుకున్న యాస్కిన్ మనుషులు సుమతిని తీసుకురావటంలో సాయం చేస్తే  కాంప్లెక్స్‌లోకి ఎంట్రీ చేస్తామని మాట ఇస్తారు. కాంప్లెక్ అడుగుపెట్టాలన్న తన కోరిక నెరవేరుతుంది అని ఎలాగైనా ఆ సుమతిని తీసుకురావాలని భైరవ బయలుదేరతాడు. 


కల్కి రాకకోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అశ్వత్థామ సుమతి రక్షణ బాధ్యత తీసుకుంటాడు. దీంతో భైరవ- అశ్వత్థామ మధ్య భీకర యుద్ధం జరుగతుంది. వీళ్లిద్దరిలో ఎవరు గెలిచారు? భైరవ అసలు ఎవరు? కల్కి ఎవరు? యాస్కిన్ కి సుమతి ఎందుకు కావాలి? మహా భారతంలోని కురుక్షేత్ర యుద్ధంతో కలి యుగం అంతం ఎలా ముడిపడి ఉంది. యాస్కిన్.. కల్కికి మధ్య తరవాత ఏం జరిగింది. భైరవ కాంప్లెక్స్ లోకి అడుగుపెట్టాడా? బుజ్జి -భైరవ చేసిన మ్యాజిక్ అన్ని సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.  


విశ్లేషణ:
దశావతారాల్లో చివరిది 'కల్కి'.  మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన , పరుశురామ, శ్రీరామ, బలరామ, కృష్ణ అవతారాలు ముగిశాయి. కానీ విష్ణువు దశావతారం 'కల్కి' అవతరణ ఇంకా మిగిలుందని మన పురాణాలు చెప్తున్నాయి. అధర్మమే అడుగడుగునా నడుస్తూ,   కలియుగంలో పాపాలు శ్రుతిమించినప్పుడు కల్కి అవతరిస్తాడని మన పురాణాలు చెప్తున్నాయి. నాలుగు యుగాలు కలిపితే ఒక మహాయుగం. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు కలిపితే ఒక మహాయుగం. వీటిలో మూడు యుగాలు ముగిశాయి. ప్రస్తుతం కలియుగం ఉంది.  ఈ కలియుగంలోనే కల్కి హిమాలయాల్లో ఉన్న రహస్యంగా ఉన్న శంభలలో జన్మిస్తాడని కల్కి పురాణం చెబుతోంది. శంభలలో విష్ణు యశుడు- సుమతి అనే దంపతులుకి కల్కి జన్మిస్తాడని మన పురాణాల్లో ఉంది. సప్త చిరంజీవులలో పరుశురాముడు, కృపాచార్య, అశ్వత్థామ, వ్యాస మహర్షి వీరు నలుగురు కల్కిని చూడటానికి శంభలకి వస్తారని, వారే కల్కికి నామకరణ చేస్తారని, కల్కికి ధర్మసంస్థాపనలోనూ సహాయం చేస్తారని కూడా ఉంది.  కలిని అంతం చేసి తిరిగి కృతయుగాన్ని కల్కి ప్రారంభిస్తాడని కల్కిపురాణం చెబుతుంది.


ఈ పాయింట్ బేస్ చేసుకుని నాగ అశ్విన్ కథ రాసుకున్నాడు. తాను తీసుకున్న కథకి కాల్పనికతని జోడించి, విజవలైజెషన్ లో తెరకెక్కించటంలో వందకి వంద శాతం సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. సినిమా  ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఆడియన్స్ ని మెప్పించారు. విజువల్స్ తో ఒక కొత్త ప్రపంచాన్ని మన ముందు ఉంచారు. మహాభారతాన్ని బేస్ చేసుకొన్న కథ అయినా నేటి టెక్నాలజీకి అనుగుణంగా రూపొందించారు. తాను రాసుకున్న కథని స్క్రీన్ మీద అలాగే చూపించగలిగాడు దర్శకుడు. భైరవ( ప్రభాస్) ఇంట్రడక్షన్ ఎపిసోడ్స్,  భైరవకి అశ్వద్ధామకి వచ్చే యాక్షన్ సీక్వెన్స్ హైలెట్ అని చెప్పొచ్చు. 

స్టార్ కాస్టింగ్ ఉన్నందుకు ఎవర్నీ తక్కువచేయకుండా అందరికీ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అన్ని  పాత్రలు శ్రద్దగా డిజైన్ చేశారు నాగ అశ్విన్. ప్రతి క్యారెక్టర్ ఎలివేట్ అయ్యి సినిమాకి అంతా ప్లస్ అయ్యారు. కొన్ని క్యామియో రోల్స్ కూడా  ఆడియన్స్ ని మెప్పించాయి. ప్రతి ఫ్రేమ్, ప్రతి షాట్ అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. మూవీ చూస్తున్నంత సేపు ఒక డివైన్ ఫీలింగ్ వస్తుంది. 


ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సీన్స్, క్లైమాక్స్ ఫైట్ సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాయి. ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ప్రేక్షకులు చూడని విజువల్స్, సెటప్ 'కల్కి 2898 ఏడీ'లో ఉన్నాయి. ఫస్టాఫ్ లో ప్రభాస్ క్యారెక్టర్ కి స్క్రీన్ స్పేస్ తక్కువ ఉన్నా ఆ లోటు తెలియలేదు. తెలుగు సినిమా అంటే హీరోయిన్ బొడ్డు, నడుము, తొడలు చూపిస్తూ...నాలుగు పాటలు, భారీ యాక్షన్ ఫైట్స్, అని మాత్రమే అని కామెంట్స్ చేసే వాళ్లకి నాగఅశ్విన్ కల్కి సమాధానం చెప్తుంది. హాలీవుడ్ రేంజ్ లో ఒక తెలుగు సినిమా ఉందని గర్వంగా చెప్పుకోవచ్చు. 


నటీనటులు :
అసలు నటీ నటుల గూర్చి చెప్పటానికి మాటలు చాలవు. ఎవరికీ వారే పోటీపడి మెప్పించారు. లెజండరీ యాక్టర్స్ నటన గూర్చి చెప్పటానికి ఏం ఉంటుంది. వారి రేంజ్ కి  మించి ఇందులో నటించారు. ఒక్కొక్కరి మేకోవర్ అద్భుతమని చెప్పాలి. ప్రభాస్ మొన్నటివరకు తన లుక్ పై విమర్శలు ఎదుర్కొన్నాడు కానీ ఇప్పుడు భైరవ పాత్రకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాడు. ప్రభాస్ ఎప్పుడు చేయని ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించాడు. అమితాబ్ , దీపికాలు కూడా సినిమాకి ఆయువుగా నిలిచారు. కమల్ హాసన్ మేకోవర్, నటనతో కొత్త కమల్ ని చూస్తాం. విశ్వనటుడు అన్న మాటకి సార్ధకత చేకూర్చాడు కమల్. ఇప్పటివరకు ఒక లెక్క ఇక నుంచి ఒక లెక్క అనేట్టు ఉంది కమల్ పాత్ర. మిగతా పాత్రలు కూడా ఎవరికి వారే అద్భుతంగా నటించారు. ఏ ఒక్క పాత్ర అనవసరం అనిపించేలా లేదు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మాళవికా నాయర్ లు ఉన్నారని ముందే తెలుసు కానీ ఆడియన్స్ కి తెలియని కొన్ని పాత్రలు  కూడా ఉన్నాయి. టాలీవుడ్ ఆడియన్స్ మెప్పించే ఎన్నో సర్‌ప్రైజ్ లున్నాయి.  


టెక్నికల్: 
ముందుగా  దర్శకుడు గూర్చి చెప్పుకోవాలి. తాను అనుకున్న కథకి దృశ్యరూపం ఇవ్వటంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడు. కేవలం రెండు సినిమాల అనుభవంతో కల్కి లాంటి కథని తెరకెక్కించటం అంటే సాహసం. ఇంత బడ్జెట్ నిర్మాతలు పెట్టారంటే దర్శకుడి పై ఉన్న నమ్మకం. ఆ నమ్మకాన్ని నాగ అశ్విన్ నిలబెట్టుకున్నాడు. అద్భుత చిత్రాన్ని మనముందు ఉంచాడు. ఇది ఒక తెలుగు సినిమా అని ప్రతి తెలుగువాడు చెప్పుకునేలా తీర్చి దిద్దాడు. నాగ్ అశ్విన్ విజన్‌, అతని టేకింగ్‌కి, ప్రెజెంటేషన్‌ ఇంకోసారి మెచ్చుకోక తప్పదు. సంతోష్ నారాయణన్ ఇచ్చిన మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ టీమ్ మొత్తం పడిన కష్టం  ఈ సినిమాలో కనిపిస్తోంది. బుజ్జి అనే మోడర్న్ టెక్నాలజీ వెహికల్ ని కల్కిలో పరిచయం చేసి యూత్ ని బాగా ఆకట్టుకున్నారు.  
                      

ప్లస్ పాయింట్స్
ప్రభాస్, అమితాబచ్చన్, కమలహాసన్, దీపిక పదుకునే 
స్టోరీ
డైరెక్షన్
విజువల్స్


మైనస్ పాయింట్స్
సెకండ్ హాఫ్ కొంచెం స్లో 
దీపికా డబ్బింగ్ 
కొన్ని చోట్ల ఎమోషనల్ కనెక్ట్ మిస్ కావడం.
మాస్ ఆడియెన్స్‌కి కనెక్ట్  అవ్వడం కష్టం


ఫైనల్ వర్దిక్ట్ : విజువల్స్... అదుర్స్!

ALSO READ : IN ENGLISH


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS