ఆదిపురుష్ టీజర్ పై ఎన్ని పెదవి విరుపులో. ఇంకెన్ని వివాదాలో..? ఈ టీజర్‌పై మీమ్స్, ట్రోలింగ్స్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి. వాటిని కంట్రోల్ చేయడానికి... ఆదిపురుష్ త్రీడీ టీజర్‌ని రిలీజ్ చేసింది చిత్రబృందం. అది కాస్త వర్కవుట్ అయ్యింది. త్రీడీలో ఆదిపురుష్ టీజర్ కొత్త - అనుభూతి కలిగించింది. నిజానికి ఈ పని ముందు చేయాల్సింది. ప్రభాస్ కూడా అదే ఫీలయ్యాడు. హైదరాబాద్ లోని ప్రెస్ మీట్ పూర్తయ్యాక.. కాసేపు మీడియాతో పర్సనల్ గా మాట్లాడాడు ప్రభాస్. త్రీడీలో ముందే చూపించాల్సింది కదా..? అని అడిగితే ''అవును.. నేనూ అదే అనుకొన్నా. కానీ.. అలా జరిగిపోయిది. ఇక మీదట కంటెంట్ ఏదొచ్చినా త్రీడీలో చూపిస్తాం'' అని చెప్పేశాడు ప్రభాస్.
ఆదిపురుష్ త్రీడీ ఫార్మెట్ లో తీసిన సినిమా. ఆ ఎఫెక్ట్స్ అన్నీ త్రీడీలో బాగుంటాయి. చిన్న తెరపై అస్సలు అర్థం కావు. నిజంగానే బొమ్మలాటనే ఉంటుంది. త్వరలోనే మరో బ్యాంగ్ కంటెంట్ తో అభిమానుల ముందుకు వస్తామని ప్రభాస్ మాటిచ్చేశాడు. అక్టోబరు 23 ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా కొత్త టీజర్ రావొచ్చు. అది ముందే త్రీడీలో విడుదల చేస్తారు కాబట్టి.. సమస్య ఉండదు. కాకపోతే.. త్రీడీ తెరలు, అద్దాలు ఎంతమందికి, ఎన్ని థియేటర్లకు అందుబాటులో ఉన్నాయన్నదే ప్రశ్న. శుక్రవారం ఆదిపురుష్ త్రీడీ ట్రైలర్‌ని 60 థియేటర్లలో ప్రదర్శించారు. అది ఏమాత్రం సరిపోదు కదా? వచ్చిన ప్రతీ కంటెంట్ .. ప్రతీ అభిమానీ త్రీడీలో చూడాలి. అప్పుడే ఆదిపురుష్ టెక్నికల్ గా ఎంత స్ట్రాంగ్ గా ఉందో అందరికీ తెలుస్తుంది. త్రీడీ వెర్షన్‌లో సినిమా తీసినా.. 90 శాతం 2డీలోనే చూస్తారు. కాబట్టి 2డీలో చూసినా కంటెంట్ అదిరిపోయేలా ఉండాలి. లేకపోతే.. ఎన్ని త్రీడీ ఎఫెక్టులు పెట్టినా.. ఉపయోగం ఉండదు.