కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు సినీ ప్రముఖులు వివాదాల విషయంలో. ఎవర్నీ నొప్పించకుండా ఉండడమే వారి ఉద్దేశ్యం కావొచ్చు. అయితే కొందరు మాత్రం తప్పు చేయనప్పుడు తామెందుకు భయపడాలనే భావనతో ఉంటారు. అలాంటివారిలో 'కట్టప్ప' సత్యరాజ్ కూడా ఒకరు. హీరోగా తమిళనాట స్టార్డమ్ ఉన్న నటుడు సత్యరాజ్. ఇప్పుడంటే సీనియర్ నటుడు అయ్యారుగానీ, ఒకప్పుడు ఆయన స్టార్డమ్ అలా ఇలా ఉండేది కాదు. కర్నాటకలో సత్యరాజ్‌కి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతుండడం 'బాహుబలి' సినిమాకి ఇబ్బందిగా మారింది. దాంతో చిత్ర యూనిట్, సత్యరాజ్‌పై ఒత్తిడి ఏ రూపంలో తెచ్చిందోగానీ, వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం ఆయన చేశారు. అదీ హుందాగా. నా వల్ల సినిమాకి నష్టం జరగకూడదనే విషయాన్ని ఆయన చెబుతూనే, తన ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతినకూడదన్న భావన ఆయన మాటల్లో తొంగి చూసింది. తమిళనాడు - కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరీ జలాల వివాదం ఉంది. తమిళ ప్రజల తరఫున కావేరీ జలాల కోసం పోరాడాల్సిన బాధ్యతను సత్యరాజ్ మర్చిపోలేదు. తాను నటించిన సినిమాకి ఇబ్బంది కలగకూడదని క్షమాపణ చెప్పిన సత్యరాజ్, ఇక నుంచి ఎవరైనా తన గురించీ అన్ని తెలుసుకుని తనను సినిమాల్లోకి తీసుకోవాలని కోరారు. ఈ మాటకి తమిళనాడులో ప్రశంసలు దక్కుతున్నాయి. చాలా హుందాగా ఆయన వ్యవహరించారంటూ యంగ్ హీరో సిద్దార్ధ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు. ఇంకొందరు సినీ ప్రముఖులు కూడా, సత్యరాజ్‌ని ప్రశంసలతో ముంచెత్తారు.