'మా' ఎన్నికలలో ప్రకాష్ రాజ్ పోటీకి దిగిన సంగతి తెలిసిందే. ఆయన ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చారో.. అప్పటి నుంచీ 'మా'లో మరింత వేడి రాజుకుంది. ఈసారి ఎన్నికలలో ప్రకాష్‌రాజ్, విష్ణుల మధ్యే పోటీ ఉందన్నది విశ్లేషకుల మాట. `మా` భవనం కోసం మూడు స్థలాలు వెదికిన విష్ణు - మా సభ్యుల మనసుల్ని గెలుచుకునే దిశగా తొలి అడుగులు వేశారు. మరి ప్రకాష్ రాజ్ ఏం చేస్తారు? ఆయన విధివిధానాలేంటి? అనే ప్రశ్నలు తలెత్తాయి. పైగా ప్రకాష్ రాజ్ పై చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆయన 'మా'ని పట్టించుకోలేదని, ఎప్పుడూ ఓటు హక్కు వినియోగించుకోలేదని, ఇతర నటీనటులకు ఆయన గౌరవం ఇవ్వరని రకరకాలు కామెంట్లు. ఆమధ్య కరాటే కల్యాణీ కూడా.. ప్రకాష్ రాజ్ పై చాలా ఆరోపణలు చేశారు. వీటన్నింటిపై ప్రకాష్ రాజ్ స్పందించారు.
''విష్ణు తన సొంత డబ్బులతో భవనం కడతానన్నారు. మూడు స్థలాలు చూశామన్నారు. నాకైతే అంత స్థోమత లేదు. నేను చాలా చిన్న వ్యక్తిని. నిజానికి మా భవనం కంటే చాలా పెద్ద విషయాలున్నాయి. మా భవనాన్ని నేను సింపుల్ గా చూడడం లేదు. దానికి చాలా ఖర్చు పెట్టాలి. బోలెడంత డబ్బు కావాలి. మా సభ్యులకు కేవలం భవనమే కావాలంటే.. విష్ణుకి ఓటేస్తారు. లేదు.. ఇంకా ఏదో ఉండాలి అనుకుంటే నాకు వేస్తారు. అది మా సభ్యులు డిసైడ్ చేసుకోవాలి'' అన్నారు.
మాని పట్టించుకోలేదన్న పాయింట్ పై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ... ''మా ఎన్నికలు ఇది వరకు జరిగినప్పుడు నేను ఓటేశాను. ఏడెనిమిది సార్లు నా ఓటు హక్కు వినియోగించుకున్నా'' అని క్లారిటీ ఇచ్చారు.
నన్ను చాలా వేధించారు అంటూ కరాటే కల్యాణీ చేసిన ఆరోపణలపై మాట్లాడుతూ ''ఎప్పుడు ఏ విషయంలో నేను వేధించానో చెప్పమనండి. నిర్మాతలు నా వల్ల ఇబ్బందులు పడ్డారని చెప్పారు. పాతికేళ్లుగా ఇండ్రస్ట్రీలో ఉంటున్నా. వాళ్లతోనే నేను సినిమాలు చేస్తున్నా. ఎవరెవరిని నేను ఇబ్బంది పెట్టానో చెప్పగలరా? అలా ఎందుకు జరిగి ఉంటుంది? అనే దానికీ నేను సమాధానం ఇవ్వగలను. ప్రతీ చర్యకు ఓ ప్రతిచర్య ఉంటుంది. కేవలం ఒక కోణంలోనే ఆలోచించకూడదు'' అని చెప్పుకొచ్చారు ప్రకాష్ రాజ్. తన విధివిధానాలేంటో త్వరలోనే చెబుతానని, అందుకోసం మరో ప్రెస్ మీట్ పెడతానన్నారు.