`మా` ఎన్నికలు ఈసారి రసాభసగా అయ్యేట్టే కనిపిస్తోంది. మూడు నెలల ముందే.. ఎన్నికల వేడి రాజేసిన ప్రకాష్ రాజ్ `మా` ఎన్నికలకు.. సెంట్రాఫ్ అట్రాక్షన్ అయ్యారు. విష్ణు, జీవిత, హేమ లాంటివాళ్లు కూడా.. ఈసారి ఎన్నికల బరిలోకి దిగుతుండడంతో ఆసక్తి నెలకొంది. వారం రోజుల క్రితం ప్రకాష్ రాజ్ వర్గం, నరేష్ వర్గం వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి, వాడీ వేడీ వాదనలు వినిపించారు. ఆ తరవాత.. పరిస్థితి కాస్త సద్దుమణిగింది. ప్రకాష్ రాజ్, నరేష్.. ఇద్దరూ శాంతించడంతో పరిస్థితి చక్కబడిందనుకున్నారంతా.
అయితే ఇప్పుడు ప్రకాష్ రాజ్ మళ్లీ కెలికారు. `ఎలక్షన్స్ ఎప్పుడు` అంటూ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ `మా` ఎన్నికల్ని ఉద్దేశించి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మా ఎన్నికలకు ఇంకా 3 నెలల సమయం ఉంది. ఈలోగా జనరల్ బాడీ మీటింగ్ కూడా జరగాలి. జనరల్ బాడీ మీటింగ్ జరక్కుండా మా ఎన్నికల నియమావళి విడుదల చేసే అవకాశం లేదు. ఈ విషయం ప్రకాష్ రాజ్ కీ తెలుసు. అయినా సరే, ట్వీట్ చేశారంటే.. ఈ ఎన్నికల కోసం ప్రకాష్ రాజ్ ఎంత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారో అర్థం అవుతూనే ఉంది. మొన్నటి ప్రెస్ మీట్లో... `ఎన్నికల తేదీ ప్రకటించేంత వరకూ.. నేను గానీ, నా ప్యానల్ సభ్యులు గానీ, ఈ విషయంలో మాట్లాడం. మాకు చాలా పనులు ఉన్నాయి` అని చెప్పిన ప్రకాష్ రాజ్, అంతలోనే.. ఇలా ట్వీట్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. `మా` ఎలక్షన్ కాలెండర్ రిలీజ్ చేయాల్సింది.. ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ నే. మరి ఆయన దీనికి ఎలాంటి సమాధానం ఇస్తాడో చూడాలి.