ఇస్మార్ట్ శంకర్ పూరిని ఫామ్‌లోకి తీసుకొస్తే.. లైగర్ మళ్లీ పాతాళంలోకి పాడేసింది. ఇస్మార్ట్ తో సంపాదించింది మొత్తం.. లైగర్ కి పెట్టేశాడు. అదంతా ఇప్పుడు పోయినట్టే. పైగా తన ఆస్తులు అమ్ముకొని మరీ లైగర్ అప్పులు తీర్చాల్సివస్తోంది. బోనస్ గా తన కలల ప్రాజెక్టు `జనగణమన` కూడా ఆగిపోయింది. ఇప్పుడు అర్జెంటుగా ఓ హిట్టు కొట్టి. మళ్లీ ఫామ్ లోకి రావాలని ప్రయత్నిస్తున్నాడు పూరి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పూరికి డేట్లు ఇవ్వాలంటే కష్టమే. ఇలాంటి టైమ్ లో పూరి తన ట్రంప్‌కార్డ్‌ని వాడబోతున్నాడని సమాచారం.
పైసా వసూల్ సమయంలో బాలకృష్ణకు బాగా దగ్గరయ్యాడు పూరి. పైసా వసూల్ యావరేజ్ గా ఆడింది. అయినా పూరిపై బాలయ్యకు తిరుగులేని నమ్మకం ఏర్పడింది. మరో కథ తీసుకురా. చేద్దాం.. అని పూరికి ఎప్పుడో మాట ఇచ్చేశాడు బాలయ్య. అందుకే ఇప్పుడు బాలయ్యకు పూరి టచ్‌లోకి వెళ్లాడని టాక్.ఇటీవల పూరి - బాలకృష్ణ మధ్య సినిమాకి సంబంధించిన మంతనాలు జరిగాయని తెలుస్తోంది. అన్నీ కుదిరితే... త్వరలోనే ఈ కాంబోపై ఓ ప్రకటన రావొచ్చు.