గతేడాది డిసెంబరులో పుష్ఫ పార్ట్ 1 విడుదలైంది. అప్పటి నుంచీ.. పుష్ఫ పార్ట్ 2 షూటింగ్ ఎప్పుడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూడడం మొదలెట్టారు. జనవరిలో ప్రారంభం కావాల్సిన షూటింగ్. ఇప్పటి వరకూ ఎలాంటి అప్ డేట్ లేదు. స్క్రిప్టు విషయంలో రాజీ పడకపోవడం వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతోందని చెప్పుకొంటూ వచ్చారు. అసలు ఈ సినిమా ఈ యేడాది పట్టాలెక్కుతుందా, లేదా? అనే అనుమానాలూ వచ్చాయి.
ఈలోగా బన్నీ మరో సినిమా చేస్తాడన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే.. అదేం లేదు. ఈ సినిమా షూటింగ్ కి ముహూర్తం దాదాపు కుదిరిపోయింది. ఆగస్టులో షూటింగ్ మొదలు కానుంది. ఈలోగా లొకేషన్ల రెక్కీ కూడా జరిగిపోయింది. అంతే కాదు.. దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్లు కూడా సిద్ధం చేసేశాడట. వాటిని సుకుమార్ ఫైనలైజ్ చేసేశాడని సమాచారం. పార్ట్ 2లో.. కొత్త పాత్రలు ప్రవేశిస్తాయని ప్రచారం జరుగుతోంది.
విజయ్ సేతుపతికి ఓ కీలక పాత్ర కోసం ఎంచుకొన్నారని చెప్పుకుంటున్నారు. మరి ఇది ఎంత వరకూ నిజమో తెలియాంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. పార్ట్ 2కి ఏకంగా రూ.300 కోట్లు బడ్జెట్ కేటాయించారని చెబుతున్నారు. పార్ట్ 1తో పోలిస్తే సగానికి సగం బడ్జెట్ పెరిగినట్టే.