ఇటీవల భారీ అంచనాలతో విడులైన `రాధేశ్యామ్` తెలుగు ప్రేక్షకుల్ని, అభిమానుల్ని బాగా నిరాశ పరిచింది. సినిమా మరీ క్లాసీగా ఉందని, ప్రభాస్ ఇమేజ్‌కి తగిన కథ కాదని విశ్లేషకులు తేల్చేశారు. అభిమానులదీ అదే మాట. ప్రభాస్ లాంటి భారీ కటౌట్ పెట్టుకుని ఒక్క ఫైటూ లేదేంటి? అని వాపోయారు. దీనిపై రాధేశ్యామ్ దర్శకుడు రాధాకృష్ణ క్లారిటీ ఇచ్చారు. ఫైట్లలోనే హీరోయిజం ఉండదని, విక్రమాదిత్య క్యారెక్టర్లోనే కావల్సినంత హీరోయిజం ఉందని, తను సూపర్ పవర్ అని, అలాంటి హీరో... ఫైట్లు చేస్తే బాగోదన్నది దర్శకుడి ఫీలింగ్.
``ఫైట్ సీన్లు తీయలేక కాదు. రాయలేక అంత కంటే కాదు. కానీ ఇదో ప్రేమ కథ. ప్రేమతో ఏమైనా చేయగలం అని నిరూపించే కథ. అలాంటి కథలో ఫైట్లు ఎందుకు అనిపించింది`` అని అభిమానులకు నచ్చ జెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే `రాధేశ్యామ్ 2` గనుక ప్లాన్ చేస్తే, దాన్ని పూర్తి యాక్షన్ సినిమాగా మలుస్తానని అభిమానులకు మాట ఇచ్చాడు. కాకపోతే.. రాధే శ్యామ్ ఫలితం చూశాక.. 2 గురించి ఆశ పెట్టుకోవడం... మరీ అత్యాసే అవుతుంది. మరి ఈ దర్శకుడి కాన్ఫిడెన్స్ ఏమిటో?