విలన్లంతా... ఎప్పుడెప్పుడు హీరోలవుతామా? అనిచూస్తుంటారు. హీరోలు కూడా అంతే. `ఒక్కసారైనా నెగిటీవ్ టచ్ ఉన్న పాత్ర చేయాలి` అని కలలు కంటుంటారు. ఇప్పుడు యువ హీరో రాజ్ తరుణ్ కూడా విలన్ పాత్రపై మోజు పడుతున్నాడు. ``వాలిలో అజిత్, ప్రేమ చదరంగంలో భరత్ చేసిన పాత్రలంటే నాకు చాలా ఇష్టం. ఒక్కసారైనా అలాంటి పాత్రలో నటించాలన్నది నా కల. ఎప్పుడైనా ఆ అవకాశం వస్తే వదులుకోను`` అంటున్నాడు.
నిజానికి దర్శకుడవ్వాలని వచ్చి, అనుకోకుండా హీరో అయ్యాడు రాజ్ తరుణ్. కానీ.. ఇప్పుడు దర్శకత్వంపై తనకు ఆశ లేదట. ``అప్పట్లో చాలా కథలు రాసుకున్నా. దర్శకుడ్ని అవ్వాలనుకున్నా. కానీ.. ఇప్పుడు నా దృష్టంతా నటనపైనే ఉంది. ప్రస్తుతం రెండు సినిమాలు ఒప్పుకున్నా. మంచి కథ వస్తే వెబ్ సిరీస్‌లోనూ నటించడానికి నాకు అభ్యంతరం లేదు`` అంటున్నాడు. రాజ్ తరుణ్ నటించిన `ఒరేయ్ బుజ్జిగా` అక్టోబరు 1న `ఆహా`లో విడుదలైన సంగతి తెలిసిందే.