సినీ పరిశ్రమలో... ప్రతిభ కంటే, విజయాలకే పెద్ద పీట. ఎవరి చేతిలో హిట్లుంటే.. వాళ్ల చుట్టూనే అవకాశాలు ఈగల్లా ముసురుతుంటాయి. పారితోషికాలూ వాళ్లకే అందుతుంటాయి. అలాంటి పరిశ్రమలో చేతిలో హిట్లు లేకపోయినా... గంపెడు అవకాశాల్ని అందిపుచ్చుకొంటున్నారు ఇద్దరు హీరోలు. వాళ్లే... రాజ్ తరుణ్, కిరణ్ అబ్బవరపు.
వచ్చిన కొత్తలో హ్యాట్రిక్ విజయాలతో అలరించాడు రాజ్ తరుణ్. అయితే.. ఆ తరవాత ట్రాకు తప్పింది. గత నాలుగేళ్లలో రాజ్ తరుణ్‌కి ఒక్క హిట్టు కూడా లేదు. కనీసం యావరేజ్ గా కూడా తన సినిమా నిలవడం లేదు.
పెట్టుబడిని తిరిగి తీసుకొచ్చిన సినిమా ఒక్కటీ లేదు. అయినా సరే.. రాజ్ తరుణ్ చేతిలో సినిమాలకు కొదవ లేకుండా పోయింది. తను నటించిన `అహనా పెళ్లంట` ఇప్పుడు విడుదలకు రెడీగా ఉంది. దీంతో పాటు నాలుగు ప్రాజెక్టులు రాజ్ తరుణ్ చేతిలో ఉన్నట్టు టాక్. కిరణ్ అబ్బవరపు పరిస్థితి కూడా అంతే. `ఎస్.ఆర్.కల్యాణమండపం`తో ఒక సూపర్ హిట్టు కొట్టాడు కిరణ్. ఆ తరవాత అన్నీ ఫ్లాపులే. సబాస్టియన్, నేను మీకు బాగా కావల్సినవాడిని సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. అయినా సరే... కిరణ్ కాల్షీట్లు ఖాళీ లేవు. పైగా పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల్లో పని చేస్తున్నాడు. ఓటీటీ మార్కెట్ బాగుండడం, పెట్టుబడిలో సగం ఓటీటీ ద్వారా వచ్చేయడంతో.. వీళ్ల చుట్టూ నిర్మాతలు తిరుగుతున్నాయి. అలాగే ఓ హిట్టు కూడా పడితే - ఇక వీళ్లకు తిరుగు లేనట్టే.