రాజమౌళి ఓకే అంటే కథ రెడీ చేయడానికి సిద్ధంగా ఉన్నారట రచయిత విజయేంద్రప్రసాద్. రాజమౌళి - రామ్‌చరణ్ కాంబినేషన్‌లో 'మగధీర' సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా కోసం కొంత కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇంతవరకూ కుదరలేదు. ఇటీవలే 'బాహుబలి' సినిమాతో ప్రపంచ ప్రఖ్యాతి పొందాడు రాజమౌళి. ఈ సినిమా తర్వాత రాజమౌళి చేయబోయే సినిమా ఏంటనేది ఇంతవరకూ క్లారిటీ రాలేదు. అయితే ఈ మధ్య రాజమౌళి చేయబోయే తదుపరి సినిమా రామ్‌చరణ్‌తోనేనన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో విజయేంద్రప్రసాద్ స్పందించారు. చరణ్‌తో మళ్ళీ సినిమా చేయాల్సి ఉందనీ, అయితే రాజమౌళి నిర్ణయం తర్వాతే కథ మొదలవుతుందని చెప్పారు. విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం 'శ్రీవల్లీ' అనే సైంటిఫిక్ థ్రిల్లర్‌ని తెరకెక్కిస్తున్నారు. ఇంతవరకూ రచయితగా తన సత్తా చాటిన ఈయన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ కథకి మూలం ఆయన ప్రాణ స్నేహితుడు రమేష్ మరణం అని చెబుతున్నారాయన. ఇతరుల మనసును చదవగలగడం ఈ సినిమా కథాంశం. ఇతరుల మనసును చదవగలిగితే దుర్మార్గులను సైతం సన్నార్గంలో నడిపించొచ్చునంటున్నారాయన. గ్రాఫిక్స్‌కి పెద్ద పీట వేశారు ఈ సినిమాలో. ఇదో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. ఖచ్చితంగా ప్రేక్షకులు మెచ్చే సినిమా అవుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 15న 'శ్రీవల్లీ' ప్రేక్షకుల ముందుకు రానుంది.