చేతిలో 'అన్నాత్తె' సినిమా ఒక్కటే కాదు, మరికొన్ని సినిమాలున్నాయి. అవన్నీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోపే.. వీలైనంత త్వరగా పూర్తి చేసెయ్యాలన్నది తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఆలోచన. ఇంతలా రజినీ కాంత్ తొందరపడటం అనేది గతంలో ఎప్పుడూ లేదు. ఎందుకింత తొందరపడుతున్నాడు.? అన్నది అభిమానులకీ, తమిళ సినీ పరిశ్రమ పెద్దలకీ అర్థం కావడంలేదు.
రజినీకాంత్ వయసుని దృష్టిలో పెట్టుకుంటే, ఆయన అంత త్వరగా సినిమాలు పూర్తి చేయలేడు. కానీ, ఆయన ఒక్కసారి మేకప్ వేసుకున్నాడంటే, ఆ తర్వాత అతని ఎనర్జీని మ్యాచ్ చేయడం యంగ్ డైరెక్టర్స్‌కీ కష్టమేనంటారు చాలామంది. అయితే, ఇప్పుడు రజినీకాంత్ అనూహ్యంగా అనారోగ్యం బారిన పడ్డాడు. అపోలో ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయనకు వైద్య చికిత్స అందుతోంది. దాంతో, అటు ఆయనతో సినిమాలు నిర్మిస్తోన్న నిర్మాతలకీ, ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై ఆశలు పెట్టుకున్న నాయకులు, అభిమానులకీ కంటి మీద కునుకు లేకుండా పోయింది.
'రజనీకాంత్ తీవ్ర రక్తపోటు కారణంగా ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుంది' అని వైద్యులు చెబుతున్నారు. రేపో మాపో ఆయన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసే అవకాశం కూడా వుందట. అయితే, రజనీకాంత్ పేరుతో ఓ వీడియో మెసేజ్ విడుదల చేసేసినా ఇంత గందరగోళం చోటు చేసుకునేది కాదు. 'తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన రజినీకాంత్' అన్న ప్రచారాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రజినీకాంత్ పూర్తిగా కోలుకున్నారట.